సుకుమార్ శిష్యులు.. ఈ గుర్తింపు ఫాంటసీ ఏంటయ్యా మీకు
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:02 PM
లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ కలం నుంచి వచ్చే కథలకు, ఆయన శిష్యులు తెరకెక్కించే సినిమాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సుక్కు శిష్యులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. రెండో సినిమాకే ట్రోల్ కంటెంట్ గా మారతున్నారు.
లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలం నుంచి వచ్చే కథలకు, ఆయన శిష్యులు తెరకెక్కించే సినిమాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సుక్కు శిష్యులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. రెండో సినిమాకే ట్రోల్ కంటెంట్ గా మారతున్నారు. గురువు ఒక దారిలో నడిస్తే శిష్యులు మరోదారిని ఎంచుకుంటారు అనుకోవడం పొరపాటు. ఇటీవల సుకుమార్ పాఠశాల నుంచి వచ్చిన సినిమాలు, ఆయన శిష్యుల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఒకే పాయింట్ మీద తెరకెక్కడం విశేషం. సుకుమార్ శిష్యులైన బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యి.. ట్రోలింగ్ బారిన పడిన విషయం తెల్సిందే.
గుర్తింపు అనే ఒకే ఒక పాయింట్ చుట్టూ సుకుమార్, ఆయన శిష్యులు సినిమాలను అల్లుకొస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. పుష్ప చిత్రంలో హీరో తన ఇంటిపేరు, సొంత గుర్తింపు కోసం పోరాటం చేస్తే.. పెద్ది సినిమాలో తమ ఊరికి సరైన గుర్తింపు రావాలని హీరో ఆరాటపడతాడు. ఇక తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ చిత్రంలో కూడా సమాజంలో తమ ఉనికికి, తమ వర్గానికి గుర్తింపు దక్కాలనే పాయింట్‌నే మెయిన్ థీమ్‌గా తీసుకున్నారు.
గురువు దారిలోనే ఆయన శిష్యులు కూడా అదే గుర్తింపు లైన్‌ను పట్టుకుని వరసగా సినిమాలు తీస్తుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఏంటయ్యా సుకుమార్ మార్క్ ఈ గుర్తింపు ఫాంటసీ? గురువు నుంచి శిష్యుల వరకు అందరికీ కథ రాయాలంటే గుర్తింపు ఒక్కటే దొరికిందా? అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఒక రకంగా ఈ పాయింట్ వర్కవుట్ అయి బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నప్పటికీ, కథాంశాల్లో వేరియేషన్ లేకపోతే రొటీన్‌గా మారిపోయే ప్రమాదం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ బాక్సాఫీస్ ఫైనల్ రన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారగా, జూన్‌లో రాబోతున్న మూడో సుకుమార్ స్టూడెంట్ అయిన కార్తీక్ దండు ఫిల్మ్ వృషకర్మ లోనైనా ఈ గుర్తింపు ట్రాక్‌కు కాస్త గ్యాప్ ఇస్తారో లేదో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.