RC17: రోజుకో హీరోయిన్‌ను.. తెస్తున్నారేంట్రా

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:32 PM

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమా కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి రాగా తాజాగా మ‌రో యంగ్ బ్యూటీ పేరు ఆ జాబితాలో చేరింది.

Ram Charan, Sukumar

'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కలయికలో వస్తున్న చిత్రం 'RC17'. ఈ సినిమా అనౌన్స్ అయిన క్షణం నుంచే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమాపై ఎంత హైప్ ఉందో.. హీరోయిన్ ఎంపికపై అంతకుమించిన సస్పెన్స్ కొనసాగుతోంది.

సినిమా ప్రకటించిన నాటి నుంచి హీరోయిన్ ఎవరనే దానిపై రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొదట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ పేర్లు వినిపించాయి. అంతేకాదు, 'ధురంధర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 'సయ్యారా' సినిమాతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి అనీత్ పడ్డా, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్.. అలాగే 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో నటించిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేర్లు కూడా వినిపించాయి. కానీ, మేకర్స్ నుంచి గానీ, స్వయంగా సుకుమార్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కోసం మరో యంగ్ బ్యూటీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా మారిన అనీఖా సురేంద్రన్ (Anikha Surendran). 'విశ్వాసం', 'ది ఘోస్ట్' వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అనీఖా.. 2023లో వచ్చిన 'బుట్టబొమ్మ' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, మలయాళ భాషల్లో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. ధనుష్ డైరెక్షన్‌లో వచ్చిన 'జాబిలమ్మా నీకు అంత కోపమా' కూడా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ పేరును 'RC17' కోసం సుకుమార్ పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు రామ్ చరణ్‌కు, అనీఖాకు మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుందని, ఈ జోడీ సెట్ అవుతుందా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అయితే, సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ల ఎంపిక ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 'రంగస్థలం' సినిమా సమయంలోనూ అనుపమ పరమేశ్వరన్ పేరు పరిశీలనకు వచ్చి, చివరకు సమంతను ఫైనల్ చేయడం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో కేవలం క్రేజ్, మార్కెట్ చూసి హీరోయిన్లను ఎంపిక చేయడం ట్రెండ్ అయినప్పటికీ.. సుకుమార్ మాత్రం పాత్రకు పూర్తి న్యాయం చేయగల నటి కోసం ఆచితూచి అడుగులు వేస్తారు. అందుకే ఈ సినిమా కోసం తొందరపడకుండా, పలువురు నటీమణులకు ఆడిషన్స్, లుక్ టెస్టులు నిర్వహిస్తున్నారట. మరి సుకుమార్ మనసులో అసలు ఏ హీరోయిన్ ఉంది? ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ రామ్ చరణ్ సరసన నటించే ఆ లక్కీ బ్యూటీ ఎవరో అధికారికంగా ఎప్పుడు బయటపెడతారో చూడాలి. ఏదేమైనా సుకుమార్ సినిమా అంటేనే ప్రతి విషయంలోనూ ఓ వైవిధ్యం ఉంటుంది కాబట్టి, హీరోయిన్ ఎంపికపై కూడా భారీ సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Updated Date - Nov 19 , 2026 | 01:32 PM