Thaman: ఓజీ టూర్ ఇండియా కాన్సర్ట్ క్యాన్సిల్.. తమన్ భావోద్వేగం..
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:39 PM
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ (SS Thaman) హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన ‘ఓజీ టూర్ ఇండియా’ (OG tour india) లైవ్ కాన్సర్ట్ రద్దయింది.
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ (SS Thaman) హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన ‘ఓజీ టూర్ ఇండియా’ (OG tour india) లైవ్ కాన్సర్ట్ రద్దయింది. అన్ని ఏర్పాటు చేసుకున్నాక శనివారం సాయంత్రం వర్షం కారణంగా షో ఆగిపోయింది. దీంతో సంగీత ప్రియులు నిరాశకు గురయ్యారు. దీంతో భావోద్వేగానికి గురైన తమన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘నాకు, 56 మంది నా టీమ్‌కు గుండె పగిలే వార్త. ఓజీ టూర్ కోసం గత 45 రోజులు రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం. అందరి అభిప్రాయాలను తీసుకుని సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్ నిర్వహించాలని అన్నీ ప్లాన్ చేసుకున్నాం. తానొకటి తలిస్తే.. దైవమొకటి తలుస్తాడు. నేనెప్పుడూ ఆయనపట్ల విశ్వాసంతో ఉంటాను. అలాగే డెస్టినీని నమ్ముతా. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా మీ ప్రేమ, నమ్మకం. ఈసారి మరింత జోష్‌తో ఓజీ కాన్సర్ట్ ఉంటుంది. నా కమ్‌బ్యాక్ ఎప్పుడూ బలంగా ఉంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వేదిక వద్ద నీరు నిలిచిపోయిందని ఆర్గనైజర్స్ వెల్లడించారు. ఈవెంట్‌కు సంబంధించిన సామాగ్రి, ఎక్విప్‌మెంట్ తడిసిపోయాయని తెలిపారు. త్వరలో ఈవెంట్ తేదీని వెల్లడిస్తామన్నారు.