Varanasi: 'వారణాసి'.. స‌రికొత్త చ‌రిత్ర! ఆ థియేటర్‌లో.. టీజర్ స్క్రీనింగ్

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:59 PM

ఎస్.ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి ఇప్పటికే భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో చర్చరకు దారి తీస్తోంది.

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). ఇప్పటికే ఈ సినిమా భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో చర్చరకు దారి తీస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ వీడియోతోనే ప్రేక్షకుల ఊహలకు రెక్కలు తొడిగింది. ఇందులో మహేష్ బాబు 'రుద్ర' అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్, యాటిట్యూడ్ ఈ సినిమాలో ఊహించని విధంగా ఉండబోతున్నాయి. ఈ పాత్ర కోసం ఆయన భారతీయ ప్రాచీన యుద్ధ కళ అయిన కలరిపయట్టు సైతం ప్రత్యేకంగా నేర్చుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘వారణాసి’ టీజర్‌ను పారిస్ (Paris) లోని ప్రఖ్యాత లే గ్రాండ్ లెక్స్ (Grand Rex Paris) థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. జనవరి 5న రాత్రి 9 గంటలకు ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుండగా, దీనిని ఇండియన్ మూవీస్‌ను యూరప్‌లో రిలీజ్ చేసే సంస్థ ఆన్నా ఫిలింస్ కన్ఫర్మ్ చేసింది. దీంతో లే గ్రాండ్ లెక్స్‌లో ప్రదర్శితమయ్యే తొలి భారతీయ సినిమా టీజర్‌గా ‘వారణాసి’ కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ టీజర్ స్క్రీనింగ్ కోసం చిత్ర యూనిట్ దాదాపు 22 నుంచి 45 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి అత్యాధునిక సౌండ్, ప్రొజెక్షన్ సిస్టమ్‌లో ఈ టీజర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ సినీ దిగ్గజాల దృష్టికి తీసుకెళ్లి, ఆస్కార్ వేదిక వరకు చేర్చిన రాజమౌళి, అదే తరహా వ్యూహాన్ని వారణాసి విషయంలోనూ అమలు చేస్తున్నారని సమాచారం. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఫారిస్‌లోని థియేట‌ర్‌కు సంబంధించిన ఫొటోలు, దాని చ‌రిత్ర‌ న్యూస్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Varanasi rex

ఇక దాదాపు రూ.1,300 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ మరో ఎనిమిది నెలల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. ఈ విజువల్ వండర్‌ను మార్చి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్మెంట్ స‌మ‌యంలో విడుద‌ల చేసిన టీజ‌ర్ చాలామందికి అర్థ‌మ‌వ‌లేదు. అన్నీ సినిమాల లానే ఇది ఒక టీజ‌ర్ వీడియో అని అనుకున్నారు ఇప్ప‌టికీ అనుకుంటున్నారు. కానీ మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో ముఖ్యంగా ప్ర‌సాద్స్ పీసీఎక్స్, ఐమాక్స్ వంటి స్క్రీన్ల‌లో ఈ టీజ‌ర్ చూసిన వారికి రాజ‌మౌళి ఎలాంటి స‌బ్జెక్ట్ ట‌చ్ చేశాడు, దాని లెవ‌ల్ ఏ రేంజ్‌లో ఉన్న‌ది అర్థ‌మ‌వుతుంది. ఆ టీజ‌ర్ చూసే స‌మ‌యంలో మ‌న‌కు తెలియ‌కుంగానే గూస్ బంప్స్ రావ‌డం, ఆ విజువల్స్‌, వాటి వెన‌కాల దాగి ఉన్న అనేక‌ స్టోరీ లేయ‌ర్లు క‌న‌బ‌డి వావ్ అనిపించ‌క మాన‌దు. అవ‌తార్‌ను మించి స‌రికొత్త ప్ర‌పంచాన్ని చూడ‌బోతున్నామా అనే ఫీల్ త‌ప్ప‌క క‌లుగుతుంది. అలాంటి ఈ వార‌ణాసి టీజ‌ర్ ఇప్పుడు విశ్వ వేదిక‌పై ప్ర‌ద‌ర్శిత‌మ‌వ‌డం మ‌న దేశానికే కాక తెలుగు వారికి కూడా చాలా గ‌ర్వ కార‌ణం.

Updated Date - Jan 06 , 2026 | 06:35 AM