SS Rajamouli: 'వారణాసి' సింగిల్ మూవీ.. రూమర్స్‌కు జక్కన్న చెక్!

ABN , Publish Date - Feb 04 , 2026 | 08:18 PM

టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ బాబు హీరోగా డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'వారణాసి కి సీక్వెల్ రూమర్స్‌కు జక్కన్న చెక్ పెట్టేశారు.

varanasi

రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందే ఏ సినిమాకైనా పబ్లిసిటీతో అవసరం లేకుండా బజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ సారి ఇంటర్నేషనల్ ఎరీనాను టార్గెట్ చేస్తూ రాజమౌళి మ‌హేశ్‌బాబు (Mahesh Babu)తో వారణాసి (Varanasi) చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తామని ప్రకటించారు. హాలీవుడ్ జనం ముందుగానే తమ సినిమాల రిలీజ్ డేట్ చెప్పేసి, తరువాత సదరు చిత్రాలకు సంబంధించిన విశేషాలను విడుదల చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు 'వారణాసి' సినిమా అంటార్కిటికాలో షూటింగ్ కు ముస్తాబవుతూ ఉన్న విషయాన్ని తెలిపారు. అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ మూవీగా 'వారణాసి' నిలవనుంది. ఈ చిత్రంపై జనాలు మాత్రం పలు కథలు చెప్పుకుంటున్నారు. 'బాహుబలి' సిరీస్ లాగే 'వారణాసి' కూడా రెండుభాగాలుగా రానుందని విశేషంగా వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ- 'వారణాసి' సింగిల్ సినిమాగానే జనం ముందుకు వస్తుందని తెలిపారు. ఈ సినిమా రన్ టైమ్ మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంటుందనీ సమాచారం.

ఇప్పటి దాకా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలలో అతి నిడివిగల సినిమాలుగా 'యమదొంగ', 'ట్రిపుల్ ఆర్', 'బాహుబలి- ది ఎపిక్' నిలిచాయి. 179 నిమిషాల ప్రదర్శనా కాలంతో 'యమదొంగ' తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది... తరువాత 'ట్రిపుల్ ఆర్' మూవీ 3 గంటల 2 నిమిషాల రన్ టైమ్ తో రూపొందింది. ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసింది. రెండు భాగాల 'బాహుబలి' చిత్రాలను కలిపి 'బాహుబలి- ది ఎపిక్'గా రిలీజ్ చేశారు. ఈ మూవీ 225 నిమిషాల రన్ టైమ్ తో విడుదలయింది. అంటే 3 గంటల 45 నిమిషాల వ్యవధి అన్న మాట. ఈ మూవీ రిపీట్ రన్ సినిమాల్లో ఆల్ ఇండియాలోనే నంబర్ వన్ గా నిలచింది. కాబట్టి రన్ టైమ్ ఎంత ఉంటే అంతగా రాజమౌళికి కలసివస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ తీరున 'వారణాసి' సినిమా రన్ టైమ్ మూడు గంటలు దాటినా పర్లేదని అంటున్నారు.

ఆరంభంలో 'వారణాసి' చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించాలని భావించారు రాజమౌళి. అయితే 'వారణాసి' సబ్జెక్ట్ పూర్తయ్యాక, దీనికి మరింత బిగ్గర్ ఫార్మాట్ అవసరమని భావించామని రాజమౌళి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి దాకా ఏ ఇండియన్ మూవీ తెరకెక్కని బిగ్ ఫార్మాట్ లో 'వారణాసి' రానుందని తెలుస్తోంది. 'వారణాసి' విడుదల నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఐమాక్స్ స్క్రీన్స్ దొరికితే అన్నిటా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామనీ రాజమౌళి చెబుతున్నారు. 'వారణాసి' విడుదలకు ఇంకా 14 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే 'వారణాసి' విశేషాలపై ప్రేక్షకులు ఆసక్తిని పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే 'వారణాసి' విశేషాలు రోజుకొకటి వెలుగు చూస్తోంది. రాబోయే రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన ఎన్ని ఆసక్తికరమైన అంశాలు వస్తాయో చూడాలి.

Updated Date - Feb 05 , 2026 | 01:04 AM