Varanasi: రాజమౌళి.. రివర్స్ ప్లాన్! మాములు.. బుర్ర కాదుగా
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:45 PM
రాజమౌళి సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన నుంచి సినిమా వస్తోందంటే అది కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన విజువల్ వండర్. సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో జక్కన్నను మించిన వారు లేరనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా స్టార్ దర్శకులంతా ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న వారణాసి (Varanasi) విషయంలో కూడా రాజమౌళి తన మార్క్ మేజిక్ చూపిస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి అందరికీ షాక్ ఇస్తూ, సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే ప్రీ-ప్రొడక్షన్ కోసం ఆరు నెలలకు పైగా సమయం కేటాయించారు. ఒక పక్క కథపై రకరకాల ఊహాగానాలు వస్తుంటే.. ఒక్క చిన్న గ్లింప్స్‌తో సినిమా స్పాన్ ఏంటో చూపించి అందరి నోళ్లు మూయించారు. కథను ముందుగానే చెప్పి ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం ఆయన శైలి. అయితే వారణాసి విషయంలో మాత్రం రహస్యాన్ని మెయింటైన్ చేస్తూనే, హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందని అంతా భావించారు. కానీ రాజమౌళి మాత్రం సైలెంట్‌గా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసి బాంబ్ పేల్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న, అంటే సరిగ్గా ఉగాది పండుగ రోజున ఈ వండర్ థియేటర్లలోకి రాబోతోంది. ఎటువంటి హంగామా లేకుండా సింపుల్‌గా డేట్ చెప్పేసి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమ్మర్ సీజన్‌తో పాటు పండుగ సెలవులు కలిసి రావడంతో ఈ సినిమాకు లాంగ్ రన్ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో ఉండబోతోంది. అంటే ఇప్పటి వరకు మనం చూడని ఒక సరికొత్త అనుభూతిని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రాముడిగా మహేష్ నటించాడని ఇప్పటికే ఓపెన్‌గా చెప్పేసిన రాజమౌళి, దానికి సంబంధించిన సీక్వెన్స్ నభూతే నభవిష్యత్తు అన్న రీతిలో తెరకెక్కించారని, ఆ సీన్స్ కి థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే. వారణాసి రెండు భాగాలుగా రాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌లో "గ్లోబ్ ట్రోటర్" అని ఉండటంతో, మొదటి భాగం ప్రపంచం చుట్టూ తిరిగే అడ్వెంచర్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇక రెండో పార్ట్ "టైమ్ ట్రోటర్" పేరుతో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి ప్లాన్ చూస్తుంటే నిర్మాత పెట్టిన ప్రతి రూపాయిని వంద రెట్లు లాభాలతో వెనక్కి తీసుకురావడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి ఆలోచనలు, ఆయన విజన్ సామాన్యమైనవి కావు. మహేష్ బాబును సరికొత్తగా చూపిస్తూనే, ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ వారణాసి ప్రయాణం ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.