భారతీయ సినిమాకు కొత్త ఊపిరి

ABN , Publish Date - Feb 25 , 2026 | 07:01 PM

అన్నపూర్ణ స్టూడియోస్ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. అంతర్జాతీయ సినిమాలు సైతం హైదరాబాద్ వైపు చూసే టెక్నాలజీ వచ్చింది. ఇకపై భారీ సినిమాలన్నింటికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. ఇంతకీ అదేంటి.. దాని ప్రత్యేకత ఏంటి?

భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దేశంలోనే అత్యంత అధునాతన మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ప్రారంభమైంది. దీనికి ఎ అండ్ ఎం మోక్యాప్‌ లాబ్ (A&M MoCap Lab) అని పేరు పెట్టారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దీన్ని ఆవిష్కరించారు. మహేశ్ బాబుతో చేయనున్న 'వారణాసి'లోని కీలక సన్నివేశాలను ఈ అద్భుతమైన టెక్నాలజీతో షూట్ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ల్యాబ్ లోపలి అత్యాధునిక సౌకర్యాల గురించి మొదటిసారి గ్లింప్స్ కూడా పంచుకున్నారు.


ఈ అత్యాధునిక టెక్నాలజీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత శోభు యార్లగడ్డ మిహిరా విజువల్ ల్యాబ్స్ భాగస్వామ్యంగా ఏర్పాటు చేశాయి. 'అవెంజర్స్', 'స్పైడర్ మ్యాన్', 'నో వే హోమ్' వంటి బ్లాక్‌బస్టర్లకు టెక్నాలజీని అందించిన హాలీవుడ్ టాప్ టెక్ పార్టనర్ అనిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ ఈ ల్యాబ్ కు సపోర్ట్ ఇస్తోంది.

WhatsApp Image 2026-02-25 at 3.45.11 PM (1).jpeg

ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ భారతీయ దర్శకులకు పెద్ద బూస్ట్ అని, ఇలాంటి అధునాతన టూల్స్‌తో మరింత గ్రాండ్, ఇమ్మర్సివ్ స్టోరీలు చెప్పవచ్చని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇండియన్ సినిమాకు కొత్త ఊపిరి పోస్తుందని శోభు యార్లగడ్డ అన్నారు. సృజనాత్మకత, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయని, రాజమౌళి లాంటి దర్శకులు దీన్ని ఉపయోగించడంతో భారతీయ సినిమాలు మరింత ఎత్తుకు చేరతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్ ఇప్పుడు తన వంతు పాత్ర పోషించే సమయం వచ్చిందని, ఇలాంటి టెక్‌తో భావోద్వేగపూరిత కథలు చెప్పడం సులభమవుతుందని ఆనిమాట్రిక్ సి.టి.ఓ. బ్రెట్ ఇనెసన్ చెప్పుకొచ్చారు.


అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇండియన్ ఫిల్మ్‌మేకర్స్, గేమ్ డెవలపర్స్, యానిమేషన్ టీమ్స్‌కు ఆసియాలోనే టాప్ లెవల్ టెక్నాలజీ పార్టనర్‌గా నిలవాలన్నది ఈ స్టూడియో లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఇండియన్ సినిమాకు నిజమైన గేమ్ ఛేంజర్ గా ఇది మారుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also: వార‌ణాసి.. సగ భాగం పూర్తి చేశారు

Read Also: బాలీవుడ్ సినిమాలపై టాలీవుడ్ స్టార్స్ ఐక్యత

Updated Date - Feb 25 , 2026 | 07:12 PM