Varansi: ప్రపంచ బాక్సాఫీస్‌పై జక్కన్న గురి.. ఆ నంబర్లు చూస్తే షాకవ్వాల్సిందే!
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:17 PM
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi). బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి గ్లోబల్ హిట్ల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల కోసం జక్కన్న హాలీవుడ్ స్థాయి ప్లాన్ వేసినట్లు సమాచారం. మరి రాజమౌళి వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
దర్శకధీరుడు ఈ చిత్రాన్ని కేవలం భారత్‌కే పరిమితం చేయకుండా, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించేలా భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఏడాది రాబోతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 60 వేల నుంచి 65 వేల స్క్రీన్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, చైనా మార్కెట్లలో ఒకేసారి భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు రాజమౌళి అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ రేంజ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చూస్తుంటే.. రాజమౌళి ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కేవలం స్క్రీన్ల మేనేజ్‌మెంట్‌తో పాటు కలెక్షన్ల విషయంలోనూ జక్కన్న మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్లోనే కనీసం 50 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. హాలీవుడ్ స్థాయి సినిమాలకే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లను ఆశించడం సవాలుతో కూడుకున్న అంశం. కానీ, రాజమౌళికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదని ఆయన గత సినిమాలే నిరూపించాయి. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ఆయన, ఇప్పుడు 'వారణాసి'తో గ్లోబల్ స్థాయిలో మన సినిమా పేరు మారుమోగిపోయేలా కంకణం కట్టుకున్నారు. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఆడియెన్స్‌ను ఫిదా చేసిన రాజమౌళి, ఈసారితో ఏకంగా వరల్డ్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాయాలని చూస్తున్నారు.
ఇక గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. మహేశ్ బాబు క్రేజ్, రాజమౌళి టేకింగ్ మ్యాజిక్ తోడైతే అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో ఊహించడం కూడా కష్టమేనని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి రాజమౌళి వేస్తున్న ఈ గ్లోబల్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? 'వారణాసి' సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.