శ్రీనిధి.. అప్పుడే అంత పెద్ద పిల్లలకు తల్లా..

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:34 PM

ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క పాత్రల్లో కనిపించేవారు.

Adarsha Kutumbam

ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క పాత్రల్లో కనిపించేవారు. ఎందుకంటే ముందే అలాంటి పాత్రల్లో కనిపిస్తే.. ఇక కెరీర్ మొత్తం అలాంటి పాత్రలే వస్తాయని భయపడేవారు. కానీ, జనరేషన్ మారింది.. ఇండస్ట్రీ కూడా మారుతూ వస్తోంది.. డైరెక్టర్లు సైతం వారిని గ్లామర్ డాల్స్ గా కాకుండా కథను మలుపు తిప్పే వెపన్స్ గా వాడుతున్నారు. అలానే హీరోయిన్లు కూడా మారుతున్నారు. కథను బట్టి ఎలాంటి పాత్రకు అయినా ఓకే చెప్పేస్తున్నారు. పెళ్లి కాకముందే సినిమాల్లో తల్లులుగా నటించి మెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఐశ్వర్య రాజేష్.. నలుగురు పిల్లలకు తల్లిగా నటించి షాక్ ఇచ్చింది. తన వయస్సుకు మించిన పాత్ర అయినా కూడా ఆమె నటనతో సినిమా సక్సెస్ కి కారణం అయ్యింది. ఇక ఇప్పుడు ఆమెలానే మరో బ్యూటీ ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. శ్రీనిధి శెట్టి.


కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. తెలుగులో తెలుసు కదా సినిమాతో అడుగుపెట్టినా.. దానికి ముందు హిట్ 3 సినిమా రిలీజ్ అవ్వడంతో టాలీవుడ్ లో మొదటి అడుగు హిట్ తోనే పెట్టింది. దీని తరువాత ఆచితూచి అడుగులు వేస్తోన్న ఈ భామ.. గురూజీ చేతిలో పడింది. విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ల కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ ఫ్యామిలీ డ్రామాను రాబోయే అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.


ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ సరసన మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీనిధి శెట్టి. అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆమెను ఒక సాంప్రదాయబద్ధమైన మధ్యతరగతి గృహిణిగా చూపించడమే కాకుండా, ఆమెకు ఇద్దరు టీనేజ్ వయసున్న పిల్లలు కూడా ఉన్నట్లు చూపించారు. గ్లామరస్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన శ్రీనిధిని ఇలాంటి డీ-గ్లామరైజ్డ్ హౌస్‌వైఫ్ పాత్రలో, అదీ టీనేజ్ పిల్లల తల్లిగా చూపించడంతో ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఆమెతో ఇలాంటి మదర్ క్యారెక్టర్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు మేకర్స్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. నిజం చెప్పాలంటే శ్రీనిధి వయస్సు 33.. ఐశ్వర్య కంటే చిన్నది. అలాంటి ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా ఎలా సెట్ అవుతోంది.. అది కూడా వెంకటేష్ భార్యగా.. అసలు గురూజీ ఇలాంటి క్యాస్టింగ్ ఎలా తీసుకున్నాడు అంటూ మండిపడుతున్నారు.


మరోవైపు సినిమా విశ్లేషకులు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ స్క్రిప్ట్‌లలో పాత్రల వెనుక ఎప్పుడూ ఒక బలమైన ఎమోషన్, పెద్ద ట్విస్ట్ దాగి ఉంటాయని, శ్రీనిధి శెట్టి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికే ఈ ఛాలెంజింగ్ రోల్‌ను ఒప్పుకొని ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు తోడు శ్రీనిధి శెట్టి పాత్రలోని ఇంటెన్సిటీ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ చిన్నది.. ఆదర్శ కుటుంబంతో ఎలాంటి హిట్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jun 27 , 2026 | 06:34 PM