దెబ్బేసిన రెండు సినిమాలు! శ్రీవిష్ణుకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:45 PM

శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం', 'మృత్యుంజయ్‌' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్‌ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు అతని అభిమానులను నిరాశకు గురిచేశాయి.

Sri Vishnu

తెలుగు సినిమా హీరోలలో డిఫరెంట్ స్టోరీస్‌ను ఎంపిక చేసుకుంటాడనే పేరు శ్రీవిష్ణు (Sreevishnu) కు ఉంది. ఒక్కోసారి ఈ వైవిధ్యం పరాకాష్ఠకు చేరడంతో 'శ్వాగ్' (Swag) లాంటి సినిమాలు చేసి... దారుణమైన పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. గత యేడాది అతను నటించిన '#సింగిల్‌' మూవీ మంచి విజయాన్నే అందుకుంది. అదే ఊపుతో 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) లో అతిథి పాత్రకు మించిన క్యారెక్టర్ చేసి... ఆ సినిమా విజయంలో తనూ భాగస్వామిగా నిలిచాడు. ఆ ఆనందం ఇప్పుడు రెండు వరుస పరాజయాలతో ఆవిరి అయిపోయింది. గత యేడాది శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం (Vishnu Vinyasam), మృత్యుంజయ్‌ (Mrithyunjay)' చిత్రాలలో నటించాడు. 'మృత్యుంజయ్' చిత్రం విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్రై డేస్‌ జనం ముందుకు వచ్చాయి.


ఫిబ్రవరి లాస్ట్ వీకెండ్‌లో 'విష్ణు విన్యాసం' విడుదలైంది. వాస్తును, లక్కీ నంబర్లను నమ్మే యువకుడిగా శ్రీవిష్ణు వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు కానీ ప్రేక్షకులు దాన్ని ఏమంత గొప్పగా రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆ పీడకల నుండి బయటకు రాకముందే 'మృత్యుంజయ్‌' సినిమా మార్చి ఫస్ట్ వీకెండ్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విజయంపై నమ్మకం ఉన్న మేకర్స్ మీడియాకు ఒక రోజు ముందే సినిమాను చూపించారు. చూసిన వారంతా సినిమా బాగుందని కితాబిచ్చారు. కానీ కామన్ ఆడియెన్ మాత్రం ఈ సినిమాకు దూరంగానే ఉన్నాడు. చూసిన కొందరు కూడా ఇది థియేట్రికల్ మూవీ కాదు ఓటీటీ సినిమా అని తేల్చేశారు. శుక్ర, శనివారాలు ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చినా... కాస్తంత మెరుగైనా కలెక్షన్స్ రావాల్సిన ఆదివారం నాడు వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బేసింది. ఆ రోజున కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఇక సోమవారం కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవు. దాంతో శ్రీవిష్ణుకు ఈ రెండు సినిమాలు గట్టి దెబ్బే వేశాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించేశాయి. శ్రీవిష్ణు నటుడిగా కష్టపడి ఈ చిత్రాలలోని పాత్రలకు న్యాయం చేకూర్చినా, ఇలా వారం కూడా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయకూడదని బయ్యర్లు హితవు పలుకుతున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 08:58 PM