ఏమైనా శ్రీలీల యాక్టింగ్ ముందు మమితా వేస్ట్ రా..
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:38 PM
సాధారణంగా ఒక సినిమా రీమేక్ వేరే భాషలో రిలీజ్ అయ్యింది అంటే ఒరిజినల్ వర్సెస్ రీమేక్ డిబేట్ కచ్చితంగా నడుస్తుంది. ఒరిజినల్ హిట్ అయ్యి.. రీమేక్ కనుక మిక్స్డ్ టాక్ అందుకుంటే.. ఆ డిబేట్ కాస్త ట్రోల్స్ గా మారతాయి.
సాధారణంగా ఒక సినిమా రీమేక్ వేరే భాషలో రిలీజ్ అయ్యింది అంటే ఒరిజినల్ వర్సెస్ రీమేక్ డిబేట్ కచ్చితంగా నడుస్తుంది. ఒరిజినల్ హిట్ అయ్యి.. రీమేక్ కనుక మిక్స్డ్ టాక్ అందుకుంటే.. ఆ డిబేట్ కాస్త ట్రోల్స్ గా మారతాయి. తాజాగా జన నాయగన్ ట్రోల్స్ బారినే పడింది. కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం జననాయగన్. ఎన్నో వివాదాల తరువాత ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. తమిళ్ తంబీలకు ఈ సినిమా ఎక్కినా.. తెలుగువారు మాత్ర అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే.. ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించి మెప్పించిన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్‌గా గా రావడమే. సరే రీమేక్ అయినా కూడా విజయ్, మమితా బైజు, పూజా హెగ్డే నటించిన సినిమా కావడంతో ఎలా ఉంటుందో అనుకోని వెళ్ళిన తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది.
ఒకవేళ ఈ సినిమా తమిళనాడు ఎన్నికల ముందు వచ్చి ఉంటే విజయ్‌కి రాజకీయాంశాల వల్ల ఉపయోగపడేదేమో కానీ, సినిమాగా మాత్రం ఘోరంగా విఫలమైందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. భగవంత్ కేసరిలోని అసలు సిసలైన ఎమోషన్‌ను పక్కనపెట్టి, కేవలం పొలిటికల్ డైలాగులతో సినిమాను నింపేశారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. భగవంత్ కేసరిలో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే బంధం, విజ్జి పాప భయం, భగవంతన్న ఆవేదన, లారీ సీన్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని.. కానీ తమిళ వర్షన్‌లో ఆ ఎమోషన్ కాస్త కూడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. జన నాయగన్ లో మమితా నటన చూసాకా మొట్టమొదటిసారి శ్రీలీల నటనను మెచ్చుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. విజ్జి పాపగా శ్రీలీల నటన ముందు మమితా ఏమాత్రం పనికిరాదని తేల్చిచెప్పేస్తున్నారు. బాలయ్యతో ఉన్న బాండింగ్, క్లైమాక్స్ లో ఆ ఫైట్ చాలా న్యాచురల్ గా ఉందని, మమితా నటన బాగున్నా.. శ్రీలీల కన్నా ఎక్కువ చేయలేకపోయిందని అంటున్నారు. తెలుగులో శ్రీలీల పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ డ్రామా బలంగా ఉంది. కానీ జన నాయగన్ లో తమిళ నెటివిటీ, పొలిటికల్ డైలాగుల హడావుడిలో మమితా క్యారెక్టర్‌ని సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో ఆమె పాత్ర కేవలం ఒక ఏడుపుగొట్టు క్యారెక్టర్‌లా మిగిలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా శ్రీలీల నటనను మెచ్చుకోవడానికే జన నాయగన్ తెరకెక్కించినట్లు ఉందని చెప్తున్నారు.
మరోపక్క శ్రీలీల కెరీర్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. అంత మంచి నటన ఉన్నా ఆమెకు అవకాశాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే శ్రీలీలకు మొదట్లో అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, ఎలాంటి కథను ఓకే చేయాలి.. ఎలాంటి కథను ఎంచుకోవాలి అనేదానిపై అమ్మడికి సరైన క్లారిటీ లేక ఇలా పరాజయాలను అందుకుంటుందని, ఒక మంచి హిట్ పడితే శ్రీలీల మళ్లీ సెట్ అవుతోందని చెప్తున్నారు. మరి శ్రీలీలకు అలాంటి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.