డాక్టర్ శ్రీలీల: అనుకున్నది సాధించింది.. తల్లి మాట నెరవేర్చింది
ABN , Publish Date - Feb 11 , 2026 | 07:01 PM
మొత్తానికీ శ్రీలీల అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. తల్లి కోరిక మేరకు పట్టుదలగా డాక్టర్ పట్టాను పొందింది. ఇప్పుడు ఆమె డాక్టర్ కమ్ యాక్టర్ శ్రీలీల.
సినిమా రంగంలో ఏదో మ్యాజిక్ ఉంది! వివిధ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు సైతం నటీనటులుగా, దర్శక నిర్మాతలుగా తమ సత్తా చాటుకోవడానికి ఈ రంగంలోకి వస్తుంటారు. ఇక్కడ అనేక కష్టనష్టాలను చిరునవ్వుతో భరిస్తారు. అందులో కొందరు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొందరు నిరాశతో వెనుదిరుగుతారు. వైద్య వృత్తిని కాదనుకుని సినిమాల్లోకి వచ్చిన వారూ చాలామంది ఉన్నారు. అయితే చిత్రంగా సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అదీ నటిగా స్టార్ స్టేటస్ ను అందుకున్న తర్వాత వైద్య విద్యను పూర్తి చేసిన ఘనత శ్రీలీలకు దక్కుతుంది. బిజీ షెడ్యూల్స్ మధ్య ఏ మాత్రం గ్యాప్ దొరికినా చదువుపై శ్రీలీల దృష్టి పెట్టింది. డాక్టర్ అవుతానని తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు దర్శక నిర్మాతల నుండి కూడా సహకారం, ప్రోత్సాహం లభించాయి.
విశేషం ఏమంటే... చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ వారసులను సినిమా రంగంలోకి తీసుకు రావాలని చూస్తారు. అయితే శ్రీలీల తల్లి స్వర్ణలత అందుకు భిన్నం. కూతురుకు ఇష్టమైన సినిమా రంగంలో ఆమెను ప్రోత్సహిస్తూనే... తన వైద్య వృత్తిలోకి శ్రీలీలను ప్రవేశపెట్టాలని భావించారు. అలా యాక్టర్ కమ్ డాక్టర్‌గా శ్రీలీల ఇవాళ తల్లి కోరికను తీర్చినట్టు అయ్యింది. శ్రీలీల ఎంబీబీయస్ పూర్తి చేసి పట్టాను స్వీకరిస్తున్న ఫోటో, చిన్నపాటి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. పట్టుదల ఉంటే ఎలాంటి ఒత్తిడిలో అయినా అనుకున్న లక్ష్యాన్ని మహిళలు చేరుకోగలరని శ్రీలీల నిరూపించింది. ఈ సందర్భంగా ఆమెపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.