Sonusood: ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ సంచలన సూచనలు..
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:21 PM
ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించారు.
ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూసూద్(Sonusood) స్పందించారు. విమాన ప్రయాణ భద్రతకు సంబంధించి మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ తలుపును తెరవాల్సిన అవసరం ఏర్పడితే.. బయట ఉన్న సిబ్బంది కూడా సహాయం చేయగలిగేలా అదనపు భద్రతా వ్యవస్థను రూపొందించడంపై విమానయాన సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు.ఈ మేరకు సోనూసూద్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "విమానయాన భద్రత అనేది ఒకసారి ఏర్పాటు చేసిన వ్యవస్థతో ఆగిపోయే విషయం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరచాల్సిన అంశం. కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు అత్యవసర పరిస్థితుల్లో తలుపు తెరవలేని పరిస్థితి ఎదురైతే.. బయట ఉన్న సిబ్బంది అవసరమైన సహాయం అందించేలా ప్రత్యేక విధానం ఉండాలి. అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించేలా అత్యంత భద్రతతో కూడిన ప్రత్యేక యాక్సెస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావచ్చేమో పరిశీలించాలి'' అన్నారు.
ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో కెప్టెన్, కోపైలట్ మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో కెప్టెన్ గాయపడటంతో విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.