సోనియాగాంధీ బయోపిక్‌.. తెలుగులో సినిమా తీస్తామన్న జగ్గారెడ్డి!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:19 PM

సోనియాగాంధీ జీవితంపై తెలుగులో బయోపిక్ తెరకెక్కించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు.

Sonia Gandhi Biopic, Jagga Reddy

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాసిన బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ (Belonging A Journey of Love) పుస్తకం ఆధారంగా ఆమె జీవితంపై సినిమా తీస్తానని టీపీసీసీ (Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి (Jagga Reddy) ప్రకటించారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలని వెల్లడించారు. 25న జరగనున్న తన కొడుకు భరత్సాయిరెడ్డి వివాహ వేడుకకు సంబంధించి బుధవారం సంగారెడ్డిలో ఆయన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరై తన కుమారుడిని ఆశీర్వదించాలని వారిని పేరుపేరునా ఆహ్వానించారు.

అనంతరం సోనియా రాసిన పుస్తకం గురించి ప్రస్తావించారు. ఆమె జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారని.. అయినా విజయవంతమైన నాయకురాలిగా ఎదిగారని కొనియాడారు. మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా వదులుకున్నారని చెప్పారు. ఈ దేశం కోసం రాహుల్, ప్రియాంకను ముందుకు నడిపిస్తున్న ఘనత కూడా ఆమెదేనని ప్రశంసించారు. సముద్రమంత లోతున్న కాంగ్రెస్ రాజకీయాన్ని అధ్యయనం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జగ్గా రెడ్డి కొనియాడారు.

ఈ దేశంలోని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, పరిస్థితులపై సమగ్ర అవగాహన ఆమెకు ఉన్నందునే ఉపాధి హామీ పథకాన్ని ఆచరణలోకి తెచ్చారని తెలిపారు. సోనియాగాంధీ జీవితంపై ముందుగా తెలుగులో సినిమాను తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇందుకోసం 50 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనికి గాంధీభవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షకులుగా ఉంటారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ (Mahesh Kumar) ల‌తో క్లాప్ కొట్టించి షూటింగ్ ప్రారంభించేలా త్వరలోనే సన్నాహాలు చేస్తామని తెలిపారు.

జ‌గ్గారెడ్డి.. కీల‌క పాత్ర‌లో

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జీవిత కథను వెండితెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పుడు మరో కారణంతోనూ వార్తల్లో నిలిచారు. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘జగ్గారెడ్డి - ఎ వార్ ఆఫ్ లవ్’ (Jagga Reddy - A War of Love) అనే పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వడ్డి రామానుజం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగ్గారెడ్డి తన నిజ జీవిత వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇది ప్రేమకథా చిత్రమైనప్పటికీ, తన పాత్రకు ప్రేమకథతో ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్వ‌యంగా వెల్లడించారు. ఇంటర్వెల్‌కు ముందు పరిచయమయ్యే ఈ పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవుతూ సినిమా ముగింపు వరకు కొనసాగ‌నుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుద‌ల కానుండ‌డం విశేషం.

Updated Date - Nov 12 , 2026 | 05:28 PM