కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ కావాలి...
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:07 PM
సాయి సింహాద్రి హీరోగా నటించి నిర్మించిన సినిమా 'సన్ ఆఫ్'. ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
సాయి సింహాద్రి (Sai Simhadri) హీరోగా నటించి నిర్మించిన సినిమా 'సన్ ఆఫ్' (Son Of). బత్తుల సతీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ను, పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, వి.ఎన్. ఆదిత్య, రామ సత్యనారాయణ రాజు, రఘు కుంచె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ (Kona Venkat) మాట్లాడుతూ, 'సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను బట్టి ఆ మూవీ మీద ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ సినిమాకు వారంతా చక్కగా సెట్ అయ్యారు. సాయి సింహాద్రి హీరోగా నటించడం కోసం నిర్మాత అయ్యాడా లేక నిర్మాత అయ్యాక హీరోగా మారాడా అనేది తెలియడం లేదు. ఏదేమైనా సినిమాలో మంచి కంటెంట్ ఉందని అర్థమౌతోంది. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే మరింతమంది కొత్త వాళ్ళు సినిమా రంగంలోకి వస్తారు. 'సన్ ఆఫ్' సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
హీరో కమ్ ప్రొడ్యూసర్ సాయి సింహాద్రి మాట్లాడుతూ, 'ఈ సినిమాకు ముందు ఎన్నో కథలు విన్నాను. సతీశ్ బత్తుల చెప్పిన 'సన్ ఆఫ్' కథ బాగా నచ్చింది. హీరోగా నటించాలనుకున్నప్పుడు శిక్షణ తీసుకున్నాను. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాను. గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్‌తో ఈ కథ విషయమై ఎంతో చర్చించాం. అప్పుడే ఆయన మాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశారు. అతను అద్భుతమైన సంగీతం అందించాడు. కిట్టు మాకు గొప్ప విజువల్స్ ఇచ్చాడు. శోభారాణి గారు అమ్మోరులా మా చేయి పట్టుకుని ఇంతదూరం తీసుకొచ్చారు. మా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, కంటతడిపెట్టకుండా థియేటర్ నుండి బయటకు వెళ్ళలేరు' అని ధీమా వ్యక్తం చేశారు.
ఇదొక చిత్రమైన కథ అని, సాయి సినిమా పట్ల ఉన్న అభిమానంతో న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ యాక్టింగ్, మేకింగ్ గురించి శిక్షణ తీసుకున్నాడని దర్శకుడు వి. ఎన్. ఆదిత్య తెలిపారు. ఇదే తన తొలి చిత్రమని, తప్పకుండా దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని హీరోయిన్ మీరా రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ శోభారాణి, డైరెక్టర్ సముద్ర, నిర్మాత రామ సత్యనారాయణ రాజు, గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్, మాటల రచయిత లక్ష్మీ భూపాల, నటుడు రఘు కుంచె, సినిమాటోగ్రాఫర్ కిట్టు, మ్యూజిక్ డైరెక్టర్ రిషి, నైజం పంపిణీదారుడు రిషికేశవ్ ఫిల్మ్స్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సాయి సింహాద్రికి ముంబై పంపిణీ దారుడు కమలేష్, త్వరలో తెలుగులో సినిమా చేయబోతున్న హిందీ నటి సింబుల్ ఆసీఫ్ శుభాకాంక్షలు తెలిపారు.