S Janaki: కళ్ల ముందే కుమారుడు మృతి.. జీవిత చరమాంకంలో సింగర్ జానకికి తీరని వ్యధ
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:11 AM
ప్రముఖ గాయని ఎస్.జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ గురువారం ఉదయం మైసూరులో హఠాన్మరణం పొందారు.
ప్రముఖ గాయని ఎస్.జానకి (S Janaki) ఏకైక కుమారుడు మురళీకృష్ణ (Murali Krishna) గురువారం ఉదయం మైసూరులో హఠాన్మరణం పొందారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. మురళీకృష్ణ భరత నాట్య కళాకారుడు, నటుడు, రచయిత కూడా, కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె వర్ష రెండేళ్ల క్రితం కన్ను మూశారు. హైదరాబాద్‌లో జానకితో కలసి మురళీకృష్ణ ఉండేవారు. 'శ్రుతిలయలు' చిత్రంలో తొలిసారిగా నటించిన మురళీకృష్ణ ఆ తర్వాత 'వినాయకుడు', 'మల్లెపువ్వు' చిత్రాల్లో నటించారు.
భరత నాట్య కళాకారుడు
మురళీకృష్ణ పూర్తి స్థాయి నటుడిగానే కాకుండా కళారంగంలో వేర్వేరు విభాగాల్లో తన ప్రయాణాన్ని సాగించారు. సినిమాల కంటే ఎక్కువగా ఆయనకు పేరు తెచ్చింది నాట్యమే. ఆయన శిక్షణ పొందిన భరతనాట్య కళాకా రుడు. ఆయనకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన భార్య ఉమ కూడా క్లాసికల్ డ్యాన్సర్. వారిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో భార్యతో విడిపోయిన మురళీకృష్ణ, తన తల్లి జానకితో కలసి హైదరాబాద్ లో ఉండేవారు.
ఆయనకు మలయాళం, కన్నడ భాషల మీద మంచి పట్టు ఉంది. మల యాళంలో సురాజ్ వెంజరమూడు హీరోగా రూపొందిన 'కూలింగ్ గ్లాస్' అనే సినిమాకు మురళీకృష్ణ కథను అందించారు. కొంతకాలం ఆయనసొంతంగా ఒక ఆడియో కంపెనీని కూడా నిర్వ హించారు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల వల్ల ఆయన సినిమా రంగానికి కొంత దూరం ఉంటూ వచ్చారు.
అమ్మే.. ఆయన ప్రపంచం
జానకి, మురళీకృష్ణకు మధ్య ఉన్నది కేవలం తల్లీబిడ్డల అనుబందం మాత్రమే కాదు. ఒకరిపై ఒకరు పూర్తిగా ఆధారపడిన 'విడదీయ రాని ఆత్మీయ అనుబంధం'. తండ్రి రామ ప్రసాద్ మరణించాక తల్లిని జాగ్రత్తగా చూసు కున్నారు మురళీకృష్ణ పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండే జానకి, తన కుమారుడు నటించిన 'మల్లెపువ్వు' చిత్రం కోసం స్వయంగా ప్రచారం చేశారు. 'నా కొడుకు విజయం సాధించాలి' అని ఆమె తపన పడేవారు. మురళీకృష్ణ తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు జానకమ్మే ధైర్యాన్నిచ్చారు.
అప్పటి నుంచి ఆయన తల్లి దగ్గరే ఉంటూ, ఆమె సర్వస్వంగా బతికారు. జానకి పాటలకు రిటైర్మెంట్ ప్రకటించాక, ఆమెపై సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను ఖండించి నిజానిజాలు మాట్లాడింది మురళీకృష్ణనే. అలా జానకమ్మకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డారు. అలాంటిది ఆమె కళ్ల ముందే ఆయన విగతజీవిగా మారడం ఆ తల్లికి కోలుకోలేని షాక్. ఆయన ఆమె కొడుకు మాత్రమే కాదు. జీవిత చరమాంకంలో చేతికర్ర లాంటి తోడు. ఆ కర్ర ఇప్పుడు విరిగిపోవడమే అత్యంత విషాదకరం.