P Susheela: ఏదో గాలిలో.. దీపంలా నేను వెలుగుతున్నా
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:44 AM
ఎస్. జానకి మృతిపై లెజెండరీ గాయని పి. సుశీల భావోద్వేగానికి లోనయ్యారు. తమ మధ్య విభేదాలు సృష్టించిన వారిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిగ్గజ గాయని ఎస్. జానకి (S Janaki) మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆదివారం మైసూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జానకి మృతిపై లెజెండరీ సింగర్ పి. సుశీల (P Susheela) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టమని, ఆమెలాంటి గాయని ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. జానకమ్మను ఆ సరస్వతీదేవి స్వయంగా పిలుపించుకుందని అన్నారు. శనివారం ఎస్. జానకి మృతి చెందిన జానకి మరణవార్తపై సుశీల సంతాపం తెలుపుతూ తెలుగు, తమిళభాషల్లో వీడియోలను విడుదల చేశారు.
‘జానకమ్మ ఒక అద్భుతం. ఆమె వంటి గాయని మళ్ళీ పుట్టరు. ఆమెకు సాటిలేరు. ఆమె గొంతులో పురుష, ముసలి, చిన్నపిల్లల స్వరాలు అద్భుతంగా పలికేవి. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో ఆమెకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అలాంటి గాయని మరొకరు లేరు. ఎన్ని రకాల పాటలు పాడిందో ఆమె! అలాంటి గాయని మళ్ళీ పుట్టరు. బహుశా ఆ సరస్వతీ దేవికే తన లోకంలో కచేరి చేయించుకోవాలనిపించిందేమో, అందుకే జానకమ్మను తీసుకెళ్ళి పోయింది. ఆ రోజుల్లో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి దూరం పెంచాలనుకున్న ఆ దుర్మార్గుల కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా? వారి కుట్రల వల్ల మేము ఎంతో మానసిక క్షోభను అనుభవించాం. ఏదో గాలిలో దీపంలా నేను వెలుగుతున్నాను. ఆమె మాత్రం ఇది చాలని భావించి దేవుడి వద్దకు చేరుకుంది. మమ్మలను మరచిపోవద్దు జానకమ్మా’ అని పి.సుశీల పేర్కొన్నారు.