‘పెద్ది’ విడుదలకు.. ఆటంకాలు ఉండకపోవచ్చు

ABN , Publish Date - May 03 , 2026 | 07:53 AM

సింగిల్‌ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలుపై ఈనెల 8న ఛాంబర్‌ నిర్వహించబోయే కీలక సమావేశంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా అని నిర్మాత చెర్రీ అశాభావం వ్య‌క్తం చేశారు.

Peddi

సింగిల్‌ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలుపై ఈనెల 8న ఛాంబర్‌ నిర్వహించబోయే కీలక సమావేశంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. కాబట్టి ‘జెట్లీ’ (Jetlee)కి ఎదురైన ఆటంకాలు ‘పెద్ది’ (Peddi) కి ఉండకపోవచ్చు’ అని నిర్మాత చెర్రీ (Cherry)అన్నారు.

సత్య కథానాయకుడిగా రితేష్‌ రానా తెరకెక్కించిన ‘జెట్లీ’ చిత్రాన్ని శుక్రవారం కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో ప్రదర్శించలేదు. దీనిపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri Movie Distributors LLP) సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేసింది.

సింగిల్ స్క్రీన్లలో సమస్య ఉంటే అక్కడే తేల్చుకోవాలి కానీ, మల్టీఫ్లెక్స్‌ల వరకూ తీసుకురావడమేంటని ప్రశ్నించింది. అయితే హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘జెట్లీ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో మీడియా ఈ సమస్యను నిర్మాత చెర్రీ దృష్టికి తీసుకొచ్చింది. ‘తదుపరి మీ నుంచి ‘పెద్ది’ విడుదల కానుంది.

అప్పటిలోగా ఈ సమస్య పరిష్కారమవుతుందా అన్న ప్రశ్నకు చెర్రీ స్పందిస్తూ.. ‘ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నమాట నిజమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. సింగిల్ స్క్రీన్ల‌లో కూడా పర్సంటేజ్‌ పద్ధతిని అమలు చేయాలని, లేదంటే మాకు వర్కవుట్‌ కాదని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు చెప్పాయి. అలా చేస్తే తమకు ఇబ్బందని నిర్మాతలు అంటున్నారు.

దీని పరిష్కారానికి ఒక మీటింగ్‌ నిర్వహించాలని ఛాంబర్‌ అనుకున్నది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తిరిగి ఈనెల 8న కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. మే 1 నుంచి పర్సంటేజీ విధానంలో అయితేనే థియటర్లను ఇస్తామని ఎగ్జిబిటర్లు అన్నారు.

దీనిపై ఏప్రిల్‌ 30 అర్దరాత్రి వరకూ చర్చలు జరిగాయి. కానీ సఫలం కాలేదు. మే 1న సెలవు కాబట్టి ‘జెట్లీ’ సినిమాకు మినహాయింపు ఇచ్చి ఉంటే బాగుండేది. మళ్లీ చర్చలు కొనసాగించాం. ఈరోజు నుంచి థియేటర్లు ఇచ్చేందుకు ఎగ్జిబిటర్లు అంగీకరించారు’ అని అన్నారు.

Updated Date - May 03 , 2026 | 07:53 AM