S Janaki: గాయని జానకమ్మ ఇంట విషాదం..
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:34 AM
దక్షిణాది ప్రముఖ గాయని ఎస్.జానకి (S Janaki)ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (Murali Krishna - 65) కన్నుమూశారు.
దక్షిణాది ప్రముఖ గాయని ఎస్.జానకి (S Janaki)ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (Murali Krishna - 65) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మైసూరులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గాయని కె. ఎస్. చిత్ర సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
‘మేమంతా ఎంతో ఇష్టపడే సోదరుడు, మన ప్రియమైన జానకి అమ్మగారి ఏకైక కుమారుడు మురళీ ఆకస్మికంగా మరణం ఎంతో షాక్‌కి గురి చేసింది. మంచి సోదరుడిని కోల్పోయాం. భరించలేని ఈ దుఃఖాన్ని, విషాదాన్ని అధిగమించేందుకు జానకమ్మకు ఆ భగవంతుడు అపారమైన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మురళీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా’ అని చిత్ర పోస్ట్‌లో పేర్కొన్నారు.

మురళీకృష్ణ జానకి కుమారుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుప్రసిద్థ భరతనాట్య కళాకారుడు. శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన, పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాకుండా, నటనపై ఉన్న ఆసక్తితో 'శ్రుతిలయలు', ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రం ‘కూలింగ్ గ్లాస్’కు రచయితగానూ వర్క్ చేశారు.