కోయిలమ్మ కడచూపుకు.. తరలివచ్చిన అభిమానం

ABN , Publish Date - Jul 12 , 2026 | 09:00 PM

ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌.జాన‌కి అంత్యక్రియలు అదివారం మైసూరులోని సొంత పాంహౌజ్‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ అధికార లాంఛ‌న‌ల‌తో జ‌రిగాయి.

S Janaki

కోయిలమ్మ కడచూపు కోసం అభిమానులు తరలివచ్చారు. శనివారం సుప్రసిద్ధ గాయని ఎస్‌ జానకి (S. Janaki) తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం మహారాజా కళాశాల మైదానంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన స్థలానికి ఆదివారం ఉదయం జానకి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం జానకమ్మ చివరి కోరిక మేరకు మైసూరులోని కణియనహుండీ ఫామ్‌హౌసలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ అధికార లాంఛ‌న‌ల‌తో అంత్యక్రియలు జరిపారు. హిందూ బ్రాహ్మణ సంప్రదాయ బద్ధంగా జానకి మనవరాలు అప్సర వైద్యుల క్రియలు నిర్వహించారు. చివరిసారిగా పలువురు నివాళులర్పించాక గౌరవార్థంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత నాన్నమ్మ చితికి అప్సర నిప్పుపెట్టారు.

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నివాళి

ప్రముఖ గాయని ఎస్‌ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రముఖ శ్రేష్ఠ గాయకురాలని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ ద్వారా జానకికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీతం, సంస్కృతికి ఆమె మరణం తీరనిలోటు అన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు తరతరాలుగా నిలిచిపోనున్నాయన్నారు. భవిష్యత్‌లోను ఆమె మధుర స్వరం వినేవారు మంత్రముగ్ధులవుతారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ఒక ప్రత్యేక సందేశం ద్వారా నివాళులర్పిచారు. పాటల ద్వారానే ప్రపంచమంతటా అభిమానులు సంపాదించారన్నారు. జానకి మృతి పట్ల సంగీత దర్శకుడు ఇళయరాజా విచారం వ్యక్తం చేశారు. అత్యంత గౌరవనీయులైన జానకమ్మ కన్నుమూశారన్న వార్త తీవ్ర విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, సంగీత రంగాలు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

నేను ఇష్టపడే నాన్నమ్మ.. ఆ తర్వాతే గాయకురాలు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన ఎస్‌ జానకి ముందుగా తాను ఎంతగానో ఇష్టపడే నాన్నమ్మ అనీ, ఆ తర్వాతనే గాయకురాలని మనవరాలు అప్సరా వైద్యుల అభిప్రాయపడ్డారు. ఆమె మనవరాలినని చెప్పుకొనేందుకు అదృష్టవంతురాలిగా భావిస్తానని అన్నారు. ఆమె ఒక అసాధారణ వ్యక్తి అనీ, ఆమె విజయాలు అనితర సాధ్యమని చెప్పారు. నాన్నమ్మ లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.

తరలివచ్చిన సంగీత దర్శకులు, గాయకులు

జానకమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి శాండిల్‌వుడ్‌కు చెందిన సంగీత దర్శకుడు హంసలేఖ, గాయకుడు విజయ్‌ప్రకాష్‌ దంపతులు, గాయకులు చిత్ర, సునీత, వాణి హరికృష్ణ, నటి, మాజీ మంత్రి జయమాల, ఉమాశ్రీ, తార అనురాధ, సాధుకోకిల, ఎస్‌ నారాయణ, కె కళ్యాణ్‌, మాజీ మంత్రి మహదేవప్ప, శ్రీరాములు, స్థానిక ఎమ్మెల్యేలు జీటీ దేవేగౌడ, శ్రీవత్సతోపాటు పలువురు పాల్గొన్నారు.

అంతిమయాత్రలో అభిమానులు

మైసూరు మహారాజ కళాశాల మైదానంలో ఎస్‌ జానకి పార్థివ దేహాన్ని అభిమానులు, సందర్శకులు కడచూపు తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అంతిమయాత్ర మొదలైంది. కణియనహుండికి తరలిస్తున్న వేళ అభిమానులు ‘జానకి అమర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య, కేరళ ప్రభుత్వం తరఫున రోజి ఎం జాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 06:21 AM