S Janaki: ఎస్. జానకిని గుర్తు చేసుకుంటూ సింగర్ తల్లి ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:44 PM

దివంగత గాయని ఎస్. జానకి జ్ఞాపకాలు  నెమరువేసుకుంటూ  భావోద్వేగానికి లోనయ్యారు ప్రముఖ గాయని దామిని  తల్లి శ్రీ ఝాన్సీ కృష్ణ.

దివంగత గాయని ఎస్. జానకి (S Janaki) జ్ఞాపకాలు  నెమరువేసుకుంటూ  భావోద్వేగానికి లోనయ్యారు ప్రముఖ గాయని దామిని ((Singer Damini- బాహుబలిలో 'పచ్చబొట్టేసిన' పాట పాడిన గాయని) తల్లి శ్రీ ఝాన్సీ కృష్ణ (Sri jhansi Krishna). జానకమ్మతో గడిపిన ఓ మధుర క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో హృదయాన్ని హత్తుకునే పోస్ట్ చేశారు. 'జానకమ్మని మా ఇంటికి ఆహ్వానించిన రోజు అది. టీవీలో 'జల్సా' సినిమా వస్తుండగా 'చూద్దాం' అంటూ జానకమ్మతో కలిసి అందరం ఎంతో ఆనందంగా సినిమా చూసిన ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందే మెదులుతున్నాయి. అలాగే లెన్స్ కెమెరాతో ఫొటోలు ఎలా తీయాలి? అని చిన్న పిల్లలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్న ఆ అమాయకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. నా చేతి వంటని మనసారా మెచ్చుకుంటూ మా కుటుంబంతో చాలా సరదాగా గడిపిన ఆరోజు ఎప్పటికీ మర్చిపోలేము. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అమ్మ' అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు ఝాన్సీ. ఈ పోస్ట్  వైరల్‌గా మారగా, అభిమానులు కూడా ఎస్. జానకితో తమకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమె పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని కామెంట్లు చేస్తున్నారు. 

aamini.jpg

దక్షిణాది గాన కోకిల ఎస్‌.జానకి ఈ నెల 11న మరణించిన సంగతి తెలిసిందే.  కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేల పాటలతో  సంగీత ప్రపంచంలో ఓలలాడించిన జానకమ్మను కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు ఆమెకు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు. 

Updated Date - Jul 20 , 2026 | 02:57 PM