Singeetam Srinivasa Rao: సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమించారు..
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:47 PM
సింగ్ గీతం' మొదటి నుంచి చివరి వరకు దర్శకత్వం నాదే. 40 సంవత్సరాల కల ఈ సినిమా. మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది.
'సింగ్ గీతం' మొదటి నుంచి చివరి వరకు దర్శకత్వం నాదే. 40 సంవత్సరాల కల ఈ సినిమా. మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది. ఈ కథను ఎంతోమందికి వినిపించాను. దైవ నిర్ణయం వల్ల చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సింగ్ గీతం'. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ 'ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు దర్శకత్వం నాదే. కానీ సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని బాధ్యతలు వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ ఎంతో ప్రేమతో భుజాన వేసుకున్నారు. నాగ్ అశ్విన్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు. అలాంటి ఆయన ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమించారు. ఎంతో గౌరవంతో, అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన క్రెడిట్ నాగ్ అశ్విన్‌కే దక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ కథ ఆత్మను అద్భుతంగా పట్టుకున్నారు. ఆయన తప్ప ఈ సినిమాకు ఇంత అద్భుతమైన సంగీతం ఇంకెవరూ అందించలేరని నేను నమ్ముతున్నాను. నాగ్ అశ్విన్ నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. తండ్రిలా చూసుకున్నారు. ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అశ్వినీ దత్, నాగ్ అశ్విన్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు, అలాగే నాకు ఎంతో ప్రియమైన కమల్ హాసన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కమల్ హాసన్ ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది' అన్నారు.

ఆ కోరిక తీరింది: దేవిశ్రీ ప్రసాద్
'కమల్ హాసన్ గారు తన జీవితంలోని అనుభవాలను మాతో పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక మైలురాయి లాంటి అనుభవం. ఆయన ప్యాషన్ గురించి చెప్పిన విషయాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. అశ్వినీ దత్ అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆయన్ని ఒక మాటలో వర్ణించడం చాలా కష్టం. ఆయన గురించి చెప్పాలంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒక్క సినిమా చాలు. అలాగే సింగీతం గారి గురించి చెప్పాలంటే 'పుష్పక విమానం' ఒక్కటే సరిపోతుంది. ఈ ముగ్గురిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. సంగీతానికి వారు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 'సింగ్ గీతం' సినిమాకు నేను సంగీతం అందించడం ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. ఈ సినిమాకు అద్భుతమైన రైటింగ్ టీమ్ ఉంది. సింగీతం గారితో ఈ కథ గురించి చర్చిస్తున్నప్పుడు మేము ఎంతో ఆనందాన్ని అనుభవించాం. సింగీతం గారు చేసిన ప్రయోగాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఆయన ఇప్పటికీ ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతారు. అదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఆ కోరిక సింగీతం గారి వల్ల ఈ సినిమాతో నెరవేరింది. చిన్నప్పటి నుంచి వార్తాపత్రికలలో ఉన్న కథనాలు కూడా సంగీతంలా మార్చుకోవడం నాకు అలవాటు. ఆ అలవాటు ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది. ఇలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. సినిమాలో ప్రతి మాట పాటలా వినిపించాలనే ఆలోచన చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ మాట ఈరోజు పాటగా మారింది. అదే మా ఎక్సైట్మెంట్‌కు కారణమైంది. నేను చెప్పిన క్రేజీ ఐడియాలన్నింటికీ ఎంతో సపోర్ట్ చేసిన నాగి గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన వారందరూ తమ సొంత గొంతులతోనే పాడారు. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగించే చిత్రమిది' అని అన్నారు.