మే 28న థియేటర్లకు ‘త్రికాల’
ABN , Publish Date - May 27 , 2026 | 09:10 AM
శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారతీయ సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ (Trikaal) మే 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ అంశాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, గ్రాండ్ విజువల్స్ కలయికగా రూపొందింది. దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు, మిస్టరీతో కూడిన కథనం, భయానక వాతావరణాన్ని సృష్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ, ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్న వేళ వెలుగును తీసుకువచ్చే ఒక శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలిపారు. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక భావనలను థ్రిల్లింగ్ అంశాలతో మేళవించి ‘త్రికాల’ను రూపొందించామని, ఇది ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని చెప్పారు.నిర్మాతలు కూడా ఈ చిత్రంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ కలగలిపిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలతో తన సంగీత ప్రతిభను చాటుకున్న ఆయన, ‘త్రికాల’కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.ఇక నార్త్ ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నట్లు సమాచారం. హిందీ శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.