Charming Star Sharwa: ఇదే యేడాది మరో రెండు సినిమాలు...

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:13 PM

శర్వా నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా చక్కని విజయాన్ని నమోదు చేసుకోవడంతో అతనితో సినిమాలు నిర్మిస్తున్న వారిలో సరికొత్త జోష్ నెలకొంది. త్వరలోనే 'బైకర్' మూవీ, ఈ యేడాది ద్వితీయార్థంలో 'భోగి' సినిమా రాబోతున్నాయి.

Sharwanand

ఛార్మింగ్ స్టార్ శర్వా (Sharwa) సంక్రాంతి బరిలో దిగి 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) సినిమాతో చక్కని విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి సీజన్ లో చివరిగా విడుదలైన సినిమా శర్వానంద్ దే! దాంతో ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు దొరకలేదు. ఉన్నవాటితోనే పండగ సీజన్ కానిచ్చేశాడు కానీ ఇప్పుడీ సినిమాకు థియేటర్లను పెంచడానికి పంపిణీ దారులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే... 'నారీ నారీ నడుమ మురారి' సినిమా విడుదలకు ముందు శర్వా, అతని చిత్ర నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సరైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే... ఈ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో శర్వా నటించిన మరో సినిమా 'బైకర్' ను నిజానికి డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. అదే సమయానికి బాలకృష్ణ 'అఖండ 2' (Akhanda -2) రావాల్సి ఉండటంతో దానిని వాయిదా వేశారు. దాంతో జనవరిలో 'బైకర్' (Biker) విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'బైకర్' సినిమాను పక్కన పెట్టి... సంక్రాంతి కానుకగా 'నారీ నారీ నడుమ మురారి'ని జనం ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ ఫలితం ఖచ్చితంగా 'బైకర్' బిజినెస్ మీద పడే ఆస్కారం ఉంటుంది. ఓ పాజిటివ్ మూడ్ లో 'బైకర్'ను జనం ఇప్పుడు చూస్తారు. మాళవిక నాయర్ (Malvika Nair) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జిబ్రాన్ (Ghibran) దీనికి సంగీతం అందిస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' విజయం అందుకున్న సందర్భంగా 'బైకర్'ను మరింత జోరైన ప్రచారంతో అతి త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో... ఈ యేడాది శర్వానంద్ నుండి రాబోతున్న రెండో సినిమా 'బైకర్'.


ప్రస్తుతం శర్వా నటిస్తున్న 'భోగి' (Bhoogi) సినిమా సెట్స్ మీద ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో కీలక టాకీ పాట్ చిత్రీకరణ ఇప్పుడు జరుగుతోంది. అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 1960 ప్రాంతంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కూడా ఈ యేడాది ద్వితీయార్థంలో వస్తుంది. అంటే... ఈ యేడాది శర్వా నటించిన మూడు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 'భోగి' షూటింగ్ పూర్తి కాగానే శర్వానంద్... శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా వస్తుందని ఇప్పటికే శర్వానంద్ చెప్పాడు. సో... 'నారీ నారీ నడుమ మురారి' విజయంతో శర్వా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుని, ఆయన నిర్మాతలలో, దర్శకులలో సరికొత్త జోష్‌ ను నింపింది.

Updated Date - Jan 20 , 2026 | 03:13 PM