మ్యూజికల్ జర్నీగా శర్వా 'బైకర్'
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:14 PM
శర్వా, మాళవిక నాయర్ జంటగా నటించిన 'బైకర్' మూవీ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో ఏకంగా ఎనిమిది పాటలుంటయాని మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ తెలిపారు.
చార్మింగ్ హీరో శర్వానంద్ (Sharwanadh) ఈ యేడాది సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) శర్వాకు ఊహించని విజయాన్ని కట్టబెట్టింది. అగ్ర కథానాయకుల చిత్రాలతో పోటీపడి శర్వా సక్సెస్‌ను దక్కించుకున్నాడు. దాంతో అతని మరో సినిమా 'బైకర్' ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ సంగీత దర్శకుడు జిబ్రాన్ (Ghibran) మ్యూజిక్ అందిస్తున్నాడు.
శర్వా సరసన 'బైకర్' (Biker) లో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. అభిలాష రెడ్డి కంకర దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న 'బైకర్' మూవీలో ఏకంగా ఎనిమిది పాటలుంటాయని జిబ్రాన్ తెలిపారు. సహజంగా ఇలాంటి యాక్షన్ మూవీలో నాలుగైదు పాటలకు మించి స్కోప్ ఉండదు. పాటలు కథాగమనానికి అడ్డు తగులుతాయని, మూవీ ఫ్లో దెబ్బ తింటుందని సహజంగా మేకర్స్ భావిస్తారు. అయితే కథలోని కీలకాంశాలను తెలియచేసేలా ఇందులోని పాటలు ఉంటాయట. అంటే పాటల రూపంలోనూ కథను చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు అభిలాష్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు కోసం ఎనిమిది పాటలను ఇందులో పెట్టారట. అందులో ఒకటి ఫుల్ సాంగ్ కాగా, మిగిలిన ఏడు మాంటేజ్ సాంగ్స్‌గా వస్తాయని జిబ్రాన్ చెప్పారు.
గతంలో జిబ్రాన్ తెలుగులో పలు చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. అయితే 'సాహో'లాంటి మూవీ తర్వాత మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంటే, అదే చిత్ర నిర్మాతలైన వంశీ, ప్రమోద్ తనకు 'బైకర్'లో అవకాశం ఇచ్చారని, అభిలాష్ కధను చెప్పిన తర్వాత తనకు ఇది సరైన కంబ్యాక్ మూవీ అనిపించిందని జిబ్రాన్ అన్నారు. మరి మ్యూజికల్ జర్నీగా సాగే 'బైకర్' ఆడియెన్స్‌కు ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో చూడాలి.