Sharwanand: వచ్చే సంక్రాంతికీ రంగం సిద్థం!
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:58 AM
ఈ యేడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్, వచ్చే సంక్రాంతికీ తాను శ్రీను వైట్లతో చేయబోతున్న సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు.
ఈ యేడాది సంక్రాంతి సీజన్ మూవీస్ లో ఉన్న సారూప్యం వినోదం. ఈ సీజన్ లో వచ్చిన తొలి చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) నుండి చివరి చిత్రం 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) వరకూ అన్నీ ఎంటర్ టైనింగ్ మూవీసే. వాటి విజయాల స్థాయి వేర్వేరుగా ఉండొచ్చు కానీ ప్రతి సినిమా ప్రేక్షకులను ఏదో ఒక స్థాయిలో ఎంటర్ టైన్ చేసింది. ఇక ఈ సీజన్ లో అత్యంత ఆనందాన్ని పొందిన హీరో అంటే ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)! ఎంతో కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అతనికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో గొప్ప విజయం, రిలీఫ్ కూడా లభించాయి.
గతంలో శర్వానంద్ నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి' చిత్రాలు సంక్రాంతికే వచ్చాయి. ఈ సినిమా విజయం సాధించడమే కాదు... వీటితో పాటు వచ్చిన మిగిలిన హీరోల సినిమాలూ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 2016లో బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా', జూ. ఎన్టీఆర్ 'నాన్న కు ప్రేమతో' చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ టైమ్ లో వచ్చిన అన్ని సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత సంవత్సరం 2017లో శర్వానంద్ 'శతమానం భవతి' మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. ఆ యేడాది చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వచ్చాయి. ఈ మూడు సినిమాలు విజయం సాధించాయి. ఈ యేడాది కూడా సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్ ను తెచ్చుకుని విజయపథంలో సాగడం పట్ల శర్వానంద్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ విషయమై శర్వానంద్ మాట్లాడుతూ, 'నా సినిమాతో పాటు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా చక్కని ఆదరణ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇంతవరకూ సంక్రాంతికి వచ్చిన నా మూడు సినిమాలు విజయం సాధించడంతో వచ్చే యేడాది కూడా ఖచ్చితంగా సంక్రాంతికి రావాలని అనుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ శ్రీను వైట్ల దర్శకత్వంలో నాతో నిర్మిస్తున్న సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకు రావాలని అనుకుంటున్నాం' అని అన్నారు. దర్శకుడు శ్రీను వైట్లకు సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'నమో వెంకటేశ' మంచి విజయాన్ని అందించింది. సో... వీరిద్దరూ కలిసి వచ్చే యేడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే కర్చీఫ్ వేసేశారని చెప్పాలి.