యాక్షన్ పార్ట్ చిత్రీకరణలో 'భోగి'
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:09 PM
'నారీ నారీ నడుమ మురారి'తో గ్రాండ్ విక్టరీని అందుకున్న శర్వానంద్ ఇప్పుడు 'భోగి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజా షెడ్యూల్ లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు సంపత్ నంది చిత్రీకరిస్తున్నారు.
ఈ యేడాది సంక్రాంతి సీజన్‌లో శర్వానంద్ (Sharwanand) నటించిన 'నారీ నారీ నడుమ మురారి' (Nari Nari Naduma Murari) మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో చాలా సంవత్సరాల తర్వాత శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు అదే ఊపుతో అతని మరో సినిమా 'బైకర్' (Biker) ను మార్చి 3న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ సంస్థకు ఇటీవల విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' విజయం కలిసొచ్చింది. ఇదిలా ఉంటే శర్వానంద్ ఇప్పుడు 'భోగి' (Bhogi) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
'భోగి' సినిమాను సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. 1960 నాటి కథతో 'భోగి' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన తాజా షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను నిర్మించబోతున్నారు. వీటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ (Dilip Subbarayan) కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సంపత్ నంది ఈ షెడ్యూల్‌ను పూర్తిగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కు కేటాయించారు. దీనికి తగ్గట్టుగానే తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓ రోడ్డు మధ్యలో శర్వా నిలబడి ఉండగా, అతనికి కొంత దూరంలో ఎదురుగా సంపత్ నంది, స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఉన్నారు. లైట్ల మధ్య పొగ కమ్ముకున్న ఈ వాతావరణాన్ని చూస్తే హై-వోల్టేజ్ యాక్షన్‌కు నిదర్శనంగా కనిపిస్తోంది.
'భోగి' సినిమా కోసం 1960 నాటి రోజుల్ని గుర్తు చేసేలా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ సెట్స్ వేశారు. అలానే సినిమాటోగ్రాఫర్ కిశోర్ కుమార్ అరోకియా విజువల్ ట్రీట్‌మెంట్‌తో ఆ రోజుల్లోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ కాన్సెప్ట్ వీడియో మూవీ ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఇందులో భావోద్వేగాలకు, ఘర్షణకు, నాటకీయతకు సంపత్ నంది పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయతీ (Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్నారు.