Sharwanand: పెద్దయ్యాక ఏమవుతావు అంటే.. నా సమాధానం అదేనట 

ABN , Publish Date - Feb 01 , 2026 | 09:24 AM

‘ఫ్యామిలీ హీరో’గా శర్వానంద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో సంక్రాంతి బరిలోకి దిగి, థియేటర్లలో నవ్వులు పూయించాడు.

‘ఫ్యామిలీ హీరో’గా శర్వానంద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో సంక్రాంతి బరిలోకి దిగి, థియేటర్లలో నవ్వులు పూయించాడు. చాన్నాళ్ల తర్వాత హిట్‌ ట్రాక్‌ ఎక్కిన ఈ ‘ఛార్మింగ్‌ స్టార్‌’.... సక్సెస్‌ జోష్‌తో పంచుకున్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...

22 కిలోల బరువు తగ్గా...
నన్ను చూసి బాగా సన్నబడ్డానని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి నా ఈ ప్రయత్నమంతా రాబోయే ‘బైకర్‌’ సినిమా కోసమే. అందులో 18 ఏళ్ల యువకుడిగా కనిపించాలి. అందుకే బరువు తగ్గక తప్పలేదు. ఫిట్‌గా కనపడాలి కదా. అందుకే సవాల్‌గా తీసుకున్నా. కేబీఆర్‌ పార్క్‌లో రన్నింగ్‌ చేసి, జిమ్‌కి వెళ్తూ ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నా. రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గా.

పొంగల్‌ సెంటిమెంట్‌...

నేను పండక్కి వచ్చిన ప్రతీసారి అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’తో 2016లో తొలి విజయాన్ని అందుకున్నా. మరుసటి ఏడాది సంక్రాంతికి ‘శతమానం భవతి’తో అంతకుమించిన సక్సెస్‌ చూశా. ఇక ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో పొంగల్‌ హ్యాట్రిక్‌ కొట్టా. ఎందుకో నాకు సంక్రాంతి బాగా కలిసొస్తోంది. అందుకే వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో (శ్రీనువైట్ల దర్శకత్వంలో) మీ ముందుకు వస్తా.

బాలయ్య అనుమతితోనే...

బాలకృష్ణ, శోభన, నిరోషా కాంబినేషన్‌లో చాలాకాలం క్రితం వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఏ రేంజ్‌లో హిట్‌
అయ్యిందో తెలిసిందే. ఆ క్లాసిక్‌ టైటిల్‌ను మా సినిమా కోసం పెట్టాలనుకున్నప్పుడు స్వయంగా బాలయ్య బాబుని కలిసి విషయం చెప్పా. దానికాయన ‘సూపర్‌... నిరభ్యంతరంగా పెట్టుకో’ అని ముహూర్తం పెట్టి మరీ దీవించారు. ‘అన్‌స్టాపబుల్‌ షో’లో సినిమా టైటిల్‌ను ఆయనే రివీల్‌ చేశారు.

 
ఆయనే నాకు స్ఫూర్తి

ఇంట్లో వాళ్లు, కజిన్స్‌ నన్ను ముద్దుగా చిన్ను, నందు అని పిలుస్తుంటారు. చిన్నప్పుడు ఎవరైనా ‘నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగితే ‘చిరంజీవిలా హీరో అవుతా’ అని చెప్పేవాడినట. ఆయన నటించిన ‘స్వయంకృషి’ సినిమా చూసి, కష్టపడితే నేను కూడా హీరో అవ్వొచ్చు అనిపించింది. ఆయనే నాకు స్ఫూర్తి. హీరో అవ్వకముందే చిరంజీవి గారితో కలిసి ‘థమ్సప్‌’ యాడ్‌లో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.

ఆ అనుభవంతో...

కెరీర్‌పరంగా బాధపడిన సంఘటన అంటే... ‘పడిపడి లేచె మనసు’ సినిమా ఫలితమే. ఎంతో నమ్మి చేశా. ఆ సినిమా కోసం సుమారు 130 రోజులు కష్టపడ్డా. తీరా సినిమా ఫ్లాప్‌ అయ్యేసరికి చాలా బాధపడ్డా. మూడు నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. నాకు నేనుగా విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టా. హడావుడిగా సినిమాలు చేయొద్దనుకున్నా. ఏదైనా ప్రాజెక్ట్‌కు సంతకం చేయడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.

ఆ రోజులు మళ్లీ రావు

టైం ట్రావెల్‌ చేసే అవకాశం వస్తే ఇంటర్‌ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోతా. అవన్నీ హ్యాపీడేస్‌. నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఆందోళన ఏమీ ఉండేవి కావు. అప్పుడప్పుడు కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాకెళ్లడం.. అక్కడి నుంచి దాబాకి వెళ్లి ఫుడ్‌ తినడం బాగుండేది. నిజంగా అవి గోల్డెన్‌ డేస్‌.

Updated Date - Feb 01 , 2026 | 09:24 AM