ప్రముఖ నటి.. పావలా శ్యామల కన్నుమూత
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:06 AM
కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రముఖ హాస్యనటి పావలా శ్యామల కన్నుమూశారు.
ప్రముఖ హాస్యనటి పావలా శ్యామల (Pavala Syamala) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామున 1.52 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం శ్యామల భౌతిక కాయం ఆస్పత్రి మార్చూరిలో భద్ర పరిచినట్లు తెలిపారు.
1984లో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో తెరంగేట్రం చేసిన పావలా శ్యామల సుమారు 100 వరకు సినిమాల్లో నటించగా చివరగా 2019లో వచ్చిన మత్తు వదలరా చిత్రంలో కనిపించారు. 2014 నుంచి తీవ్ర ఆర్థిక, వృద్దాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె ఆపై కూతురితో కలిసి దీన స్థితిలో కాలం వెళ్ళదీస్తూ వచ్చారు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న నాటి తెలంగాణ సీఎం తక్షణ సాయం కింద రూ.20 వేలు అందించడంతో పాటు నెల నెలా ఫించన్ అందేలా చూశారు. కానీ మరలా నాలుగైదేళ్ళకే పరిస్తితి మొదటికి రావడంతో సినీ నటులు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు వంటి వారు సాయం చేస్తూ వచ్చారు.