Giribabu Death: సావిత్రికి భర్తగా, కొడుకుగా ఒకే రోజు షూటింగ్.. గిరిబాబు జీవితంలో ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలివే!

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:55 AM

సీనియర్ నటుడు గిరిబాబు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 600కు పైగా సినిమాల్లో నటించిన ఆయన అసలు పేరు, సినీ ప్రయాణం, నిర్మాతగా, దర్శకుడిగా సాధించిన విజయాలు, ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని ముగించుకుని ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సీనియర్‌ నటుడు గిరిబాబు (83) (Giribabu). కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. రఘుబాబు, బోసుబాబు ఇద్దరు కుమారులు. మాధవి అనే కుమార్తె ఉన్నారు. రఘుబాబు హాస్యనటుడిగా మంచి గుర్తింపుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

గిరిబాబు అసలు పేరు యెర్రా శేషారావు. ప్రకాశం జిల్లా కొరిశపాడు రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆయనకు ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో భాగమయ్యారు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో ప్రతినాయకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గిరిబాబు ప్రత్యేకత పాత్రల ఎంపికలో వైవిధ్యమే. తెరపై తనదైన హావభావాలతో భయపెట్టారు. హాస్య పాత్రల్లో ఆయన చూపించిన టైమింగ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కేరక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 600 చిత్రాల్లో నటించిన గిరిబాబు ఆఖరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (2023).

నిర్మాతగా..

నటుడిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజుల్లో నిర్మాతగా మారారు గిరిబాబు. నటుడిగా ఆయన 50వ సినిమా ‘దేవతలారా దీవించండి’.. నిర్మాతగా మొదటి చిత్రమైంది. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా పేరు పెట్టుకున్నారు. జయభేరి ఆర్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఆ తర్వాత 1978లో హీరో కృష్ణతో ‘సింహ గర్జన’ చిత్రం తీసి ఎన్టీఆర్‌ ‘సింహబలుడు’తో పోటీ పడడం అప్పట్లో ఒక సంచలనం. మూడో చిత్రం ‘ముద్దు ముచ్చట’ను తన కూతురు మాధవి పేరు మీద నిర్మాణ సంస్థను ప్రారంభించి తెరకెక్కించారు. ఆయన సొంత ఊరిలో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ‘ముద్దు ముచ్చట’కు ఆయన భార్య శ్రీదేవి నిర్మాత. అనంతరం ఆ బ్యానర్‌లో ‘సంధ్యారాగం’, ‘మెరుపుదాడి’ తీశారు. ‘మెరుపుదాడి’ సినిమాలో ఇళయరాజా తొలిసారి తెలుగు పాట పాడారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తునిచ్చన్‌’ పేరుతో డబ్‌ చేస్తే మంచి విజయం సాధించింది.

దర్శకుడిగా..

‘మెరుపు దాడి’కి తాను దర్శకుడిగా పేరు వేసుకోకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు గిరిబాబు. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో వెంటనే ‘రణరంగం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు. అప్పటికే గిరిబాబు ఇద్దరు కొడుకులు ప్రయోజకులయ్యారు. పెద్దబ్బాయి రఘుబాబు ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసేవారు. చిన్నబ్బాయి బోసుబాబు నటన మీద ఆసక్తి చూపించారు. ‘మెరుపు దాడి’ తరహాలో ఓ కౌబోయ్‌ సినిమాతో బోసుబాబుని పరిచయం చేయాలనుకున్నారు తండ్రి. వెంటనే ‘ఇంద్రజిత్తు’ అనే సినిమాను తీశారు. అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్న డేట్‌కి చిరంజీవి ‘కొదమ సింహం’ విడుదలైంది. ఆ సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో ఈ సినిమా మీద ప్రభావం పడిందని చెప్పేవారు గిరిబాబు.

కృష్ణతో ప్రత్యేక అనుబంధం

గిరిబాబుకు హీరో కృష్ణతో ప్రత్యేక అనుబంధం ఉండేది. కృష్ణ 300 సినిమాల్లో నటిస్తే.. అందులో 150 చిత్రాల్లో ఆయనతో కలిసి నటించారు గిరిబాబు. పద్మాలయా సంస్థ నిర్మించే ప్రతి చిత్రంలో గిరిబాబు తప్పనిసరిగా ఉండేవారు. అలాగే శోభన్‌బాబుతో దాదాపు 30 చిత్రాల్లో నటించారు.

పేరు మార్చుకున్నారు!

తొలి రెండు చిత్రాల మేకర్స్‌కి సొంత పేరుతో శేషారావు గానే పరిచయమయ్యారు గిరిబాబు. కానీ ఆ రెండు సినిమాలు ఆగిపోవడంతో సెంటిమెంట్‌గా ఫీలయి మూడో సినిమాకు పేరు మార్చుకోవాలనుకున్నారు. తన తాత పిలిచే ‘గిరి’ అనే పిలుపు గుర్తుకు వచ్చింది. దానికి బాబుని కలిపి గిరిబాబుగా పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకున్నా కానీ ఫలితం దక్కలేదు. 1970లో ప్రారంభమైన మూడో సినిమా ‘స్వర్గానికి నిచ్చెనలు’ కూడా ఆగిపోయింది. దాంతో గిరిబాబు వేరే దారిలేక ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఊరెళ్లిన గిరిబాబుకు అట్లూరి పూర్ణచంద్రరావు ‘జగమే మాయ’ చిత్రంతో మళ్లీ అవకాశం వచ్చింది. మురళీమోహన్‌ అందులో హీరో. అలా మొదలైన సినీ ప్రస్థానం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా సాగిపోయింది. గిరిబాబుకు సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టుగా పేరొచ్చేసింది.

మూడు సినిమాల్లో ఛాన్స్‌.. మిస్‌

‘జగమే మాయ’ చిత్రం కంటే ఏడేళ్ల ముందే మూడు చిత్రాల్లో హీరో ఛాన్సులు వచ్చినట్లే వచ్చి గిరిబాబుకు మిస్‌ అయ్యాయి.. ఆయన మొట్టమొదటిగా హీరోగా సెలక్ట్‌ అయిన ‘ధైర్యే సాహసే లక్ష్మి’ సినిమా సెట్స్‌కి కూడా వెళ్లక ముందే ఆగిపోయింది. ఆ తర్వాత నటి జి.వరలక్ష్మి పిలిచి ‘తప్పటడుగులు’ అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. కానీ, అదీ ఆగిపోయింది. తర్వాత ఎస్‌.డి.లాల్‌ తీసే ‘స్వర్గానికి నిచ్చెనలు’ చిత్రంలో గిరిబాబు హీరోగా ఎంపికయ్యారు. ఈ సారి కచ్చితంగా షూటింగ్‌ మొదలైపోతుందనుకున్నారు. ఆ సినిమా కూడా ఆగిపోయింది.

భాగ్యనగరంలో..

చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చాక సాయంత్రాలను కైకాల సత్యనారాయణ, గుమ్మడితో కలిసి గడిపేవారు గిరిబాబు. చాలా సార్లు వీళ్లతో అక్కినేని నాగేశ్వరరావు కూడా కలిసేవారు.

మధురం మధురం..

‘లక్ష్మీ నిర్దోషి’ చిత్రం కోసం లోయ పక్క నుండి గుర్రంపై చేసిన స్వారీ, ‘బంగారు కలలు’ సినిమా కోసం తొలిసారి విమానం ఎక్కి హైదరాబాద్‌కి వెళ్లడం, అదే ఆయన కెరీర్‌లో తొలి రంగుల సినిమా కావడం.. ఇవ్వన్నీ మర్చిపోలేని అనుభూతులు.

అసలు నచ్చవు

నీటిని వృథా చేయడం, పచ్చని చెట్లను నరకడం గిరిబాబుకు నచ్చవు. పనీపాటా లేకుండా గంటల తరబడి సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్లను ఇష్టపడేవారు కాదు. అమితంగా తినేవాళ్లు, ఎప్పుడూ పక్కవాళ్లను దూషించేవాళ్లంటే చిరాకు పడేవారు.

సావిత్రికి భర్తగా.. కొడుకుగా

‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో మహానటి సావిత్రికి భర్తగా, ‘అనగనగా ఒక తండ్రి’ చిత్రంలో కొడుకుగా ఒకే రోజు షూటింగ్‌లో పాల్గొనడం కెరీర్‌ తొలి రోజుల్లో గిరిబాబు కు దక్కిన అరుదైన అవకాశం. అప్పటికే బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయిన వహీదా రెహమాన్‌ సరసన ‘బంగారు కలలు’ చిత్రంలో నటించే అవకాశం రావడం కూడా అలాంటిదే.

అభిమాన నటి

గిరిబాబుకు అభిమాన నటి అంజలీదేవి. ఆర్టిస్ట్‌గా ఆవిడ ఆల్‌ రౌండర్‌ అనేవారు. సీత పాత్రను ఎందరు పోషించినా ఆ పాత్ర పేరు చెప్పగానే ఆమె మాత్రమే గుర్తుకొస్తారనే వారు. ఆవిడ సమర్పణలో అంజలీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘మహాకవి క్షేత్రయ్య’లో నటించడం అదృష్టంగా భావించేవారు.

ప్రముఖుల సంతాపం

వెండితెర విలక్షణ నటుడు గిరిబాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గిరిబాబుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గిరిబాబు మృతికి ఏపీ గవర్నర్ అబ్దుల్ సజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు సినిమాకు గణనీయమైన సేవలు అందిం చారని పేర్కొన్న గవర్నర్, గిరిబాబు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600కుపైగా చిత్రాల్లో నటించి, విలన్ గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూశారని తెలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చింతించారు. ‘గిరిబాబు ఇక లేరని తెలిసి బాధ కలిగింది. విలక్షణ నటుడిగా ఆయన నటన మరుపురానిది’ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారని, గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘గిరిబాబు నటుడిగానే కాకుండా దర్శకనిర్మాతగా ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

‘ప్రముఖ నటులు గిరిబాబు లేరనే వార్త నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్రపరిశ్రమకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయం’. - మెగాస్టార్‌ చిరంజీవి

‘నా కెరీర్‌ ప్రారంభంలో ‘అన్నదమ్ముల అనుబంధం’లో గిరిబాబుతో కలసి నటించాను. నా పలు చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు. కల్మషం లేని వ్యక్తిత్వం ఆయన సొంతం’. - నందమూరి బాలకృష్ణ

‘మద్రాసులో ఉన్నప్పుడు గిరిబాబు, నా రూమ్మేట్‌. నాకు అత్యంత సన్నిహితుడైన గిరిబాబు లేరనే వార్త నన్ను కలచివేస్తోంది. శోకంతో మాటలు రావట్లేదు’. - మోహన్‌బాబు

‘నేను నిర్మించిన ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన గిరిబాబు లేరు అనే వార్తని నమ్మలేకపోతున్నాను’. - సీనియర్‌ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు

‘నాటక, సినీ రంగాల్లో చెరగని ముద్రవేసిన నటుడు గిరిబాబు. విలన్‌, హీరో, కామెడీ కేరక్టర్లను అద్భుతంగా పండించారు’. - సీనియర్‌ నటుడు మురళీమోహన్‌

వీరితో పాటు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ భరత్‌ భూషణ్‌, ప్రజా నాట్యమండలి సినిమా శాఖ అధ్యక్షులు వందేమాతరం శ్రీనివాస్‌, సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ తదితరులు సంతాపం ప్రకటించారు.

Updated Date - Nov 15 , 2026 | 07:05 AM