Dancers: డాన్సర్స్ అసోసియేషన్‌లో దుమారం.. సుమలతపై సత్య మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:32 PM
డాన్సర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వరుసగా ప్రెస్ మీట్స్ తో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
డాన్సర్స్ అసోసియేషన్‌లో (Dancers Association) కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వరుసగా ప్రెస్ మీట్స్ తో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసోసియేషన్‌లోని సమస్యలు, జనరల్ బాడీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, రాబోయే ఎన్నికలపై సీనియర్ డాన్సర్స్ సత్య మాస్టర్(Satya Master), రాజన్న మాస్టర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సభ్యుల ప్రయోజనాల కోసం ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సత్య మాస్టర్ మాట్లాడుతూ.. ఒక యూనియన్‌కు సంబంధించిన ఇంటి సమస్య ఇప్పుడు బజారున పడిందని అన్నారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో సుమారు 600 మంది సభ్యులు ఉన్నారని, అయితే కొంతమంది కారణంగా మొత్తం అసోసియేషన్‌కు సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ‘‘600 మంది ఉన్న అసోసియేషన్‌లో నాలుగు సమస్యాత్మక వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదు. ఇల్లు తగలబడుతుంటే దాన్ని కాపాడాలి కానీ మొత్తం ఇల్లు కాల్చేయాలని చూడకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత బాధ్యతాయుతంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సత్య మాస్టర్ కోరారు. అసోసియేషన్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావనతోనే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. ఫెడరేషన్ తమకు తల్లి లాంటిదని, దానితో అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, విభేదాలు వచ్చినప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదన్నారు.
సుమలత విభజించి పాలించే విధంగా వ్యవహరించడం వల్లే సమస్యలు మరింత పెరిగాయని సత్య మాస్టర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సభ్యుల నుంచి కొందరు మైకులు లాక్కున్నారని, అలాంటి పరిస్థితుల్లో అధ్యక్షురాలు వారిని నియంత్రించాల్సి ఉండగా వారికి మద్దతు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ‘‘చాలామంది డాన్సర్స్ భయంతో మాట్లాడలేకపోతున్నారు. అందుకే సీనియర్స్‌గా మేము వారి తరఫున మాట్లాడుతున్నాం. యూనియన్‌కు సమస్య వస్తే తప్పకుండా ప్రశ్నిస్తాం’’ అని సత్య మాస్టర్ అన్నారు. ఇటీవల జరిగిన సమావేశానికి సంబంధించి తమపై కేసులు పెట్టారని, సమావేశంలో గొడవ జరగకుండా వెళ్లిన తమ పేర్లను కూడా కేసుల్లో చేర్చారని ఆయన పేర్కొన్నారు. సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సత్య మాస్టర్ తెలిపారు. డాన్సర్స్‌కు న్యాయం జరగాలంటే ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
రాజన్న మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ డాన్సర్స్ అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించడానికి మద్దతు తెలిపారని చెప్పారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై సుమలత చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేషన్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించాలంటే సభ్యుల అభిప్రాయాలను గౌరవించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఆయన కోరారు.