Saravanan: ఏప్రిల్ లో 'లీడర్'గా రాబోతున్న శరవణన్!
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:11 PM
గతంలో 'ది లెజెండ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వ్యాపారవేత్త శరవణన్ ఇప్పుడు 'లీడర్' సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.
ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ (Saravanan) నటించి తొలి చిత్రం 'ది లెజెండ్' (The Legend) 2022లో విడుదలైంది. ఆ తమిళ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే అక్కడా ఇక్కడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా లెజెండ్ శరవణన్ ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్థమయ్యారు.
శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో లెజెండ్ శరవణన్ 'లీడర్' (Leader) అనే మూవీలోహీరోగా నటించారు. 'ఆర్.ఎక్స్. 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఇందులో హీరోయిన్. ఏప్రిల్ లో సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన 'లీడర్' గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ఈ గ్లింప్స్ చూస్తే, విలన్ కు చెందిన 9 కంటెయినర్లు కనిపించకుండా పోతాయి. ఆ కంటెయినర్స్ కోసం అతని అనుచరలు వెతుకుతుంటారు. ఒక చోట 9 కంటెయినర్లు కనిపిస్తాయి. కానీ ఆ కంటెయినర్స్ డ్రైవర్స్, రౌడీలు చనిపోయి ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వచ్చిన రౌడీలను కూడా హీరో మట్టుబెడతాడు. ఎవరు చంపారని ఆరా తీస్తే అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ల నాన్న అని తెలుస్తుంది. ఏరా నువ్వు హీరోవా అని విలన్ ఫోన్ చేసి అడిగితే, అవును హీరోనేరా ఏ బిడ్డకైనా తండ్రే హీరోరా అనే డైలాగ్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది.
ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, 'కొన్ని అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా, పోలీసుల ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ రెండు వర్గాల సంఘర్షణ మధ్య తనని తాను రక్షించుకుంటూ ఈ సాధారణ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు' అని తెలిపారు. 'కోడి, పట్టాస్, గరుడన్' వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ 'లీడర్' మూవీని మంచి ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జైపూర్, ఊటీ, జార్జియా, చెన్నై లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, 'బాహుబలి' ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్ తదితరులు పోషించారు. 'లీడర్' మూవీకి మహేశ్ మాథ్యూ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా జిబ్రాన్ వైభోద సంగీతం అందించారు.