రాజాసాబ్ చిన్న సినిమానా.. అంత మాట అనేశాడేంటి
ABN , Publish Date - May 10 , 2026 | 06:44 PM
ఈమధ్యకాలంలో నటీనటులకు ఏమవుతుందో అర్ధం కావడం లేదు. స్టేజిపైకి ఎక్కి మైక్ చేతిలోకి తీసుకోగానే పూనకం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.
ఈమధ్యకాలంలో నటీనటులకు ఏమవుతుందో అర్ధం కావడం లేదు. స్టేజిపైకి ఎక్కి మైక్ చేతిలోకి తీసుకోగానే పూనకం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాం.. మాట దొర్లుతుందేమో, దానివలన వివాదాలను ఎదుర్కోవాల్సివస్తుందేమో అన్న భయం కూడా లేకుండా పోతుంది. తాజాగా కమెడియన్ సప్తగిరి (Saptagiri).. రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాను చిన్న స్థాయి సినిమా అని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కమెడియన్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. హీరోగా ప్రయత్నించి, అది సెట్ కాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు సప్తగిరి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గెస్ట్ రోల్ లో అయినా కనిపించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం పురుషః. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. తాజాగా ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ఇక ప్రెస్ మీట్ లో సప్తగిరి తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయ్యిపోయింది. చేసిన పాత్రలే చేస్తున్నాను. కొత్త కొత్త పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాను. అందుకే డబ్బుకోసం కాకుండా వృత్తిపరంగా సంతృప్తి దొరికే పాత్రలను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రెగ్యులర్ గా కామెడీ పాత్రలే కాకుండా ఎమోషనల్ పండించే పాత్రలు కూడా చేయాలనీ చూస్తున్నాను. ఎప్పుడో ఏదో ఒక డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాస్తారు.. కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. రకరకాల సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.
సప్తగిరి వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏ యాంగిల్ లో రాజాసాబ్ చిన్న స్థాయి సినిమా అనిపించింది బ్రదర్ అంటూ మండిపడుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ బడ్జెట్ రూ. 350 కోట్లు అని టాక్. భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా అనడం పద్దతికాదని, ఏదో ఫ్లోలో వస్తే ఓకే కానీ, కావాలని అంటే మాత్రం అస్సలు ఊరుకొనేది లేదని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాకుండా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి పొగిడినవారిలో సప్తగిరి కూడా ఉన్నాడు. అప్పుడు అలా అని, ఇప్పుడు చిన్న స్థాయి సినిమా అనడం బాలేదని, అసలు అంత మాట అనడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.