ఈసారి సంక్రాంతి మామూలుగా లేదు.. బాక్సాఫీస్ వద్ద మహా సంగ్రామమే
ABN , Publish Date - Sep 15 , 2026 | 03:06 PM
సంక్రాంతి 2027 బాక్సాఫీస్ రేసు ఆసక్తికరంగా మారింది. మహాకాళి, జనవరి 12 విడుదల, సంబరాల ఏటిగట్టు, కాకా, జార్జ్ క్రిష్, ఫ్యామిలీ ప్యాక్ సినిమాలు పండగ బరిలోకి దిగుతున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు... అది బాక్సాఫీస్ కురుక్షేత్రం. కలెక్షన్ల సునామీ సృష్టించే అసలైన మహా సంగ్రామం.తెలుగు నేలపై పండగ శోభ ఎలా ఉంటుందో, సిల్వర్ స్క్రీన్ మీద ఆ జోష్ అంతకంటే రెట్టింపు ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి పండగ పూట పిండివంటలు ఆస్వాదించినట్టే, థియేటర్లలో కుటుంబ సమేతంగా సినిమాలు చూడటం టాలీవుడ్‌లో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈసారి సంక్రాంతి రేసు మామూలుగా ఉండేలా లేదు. ఇప్పటికే అరడజనుకి పైగా సినిమాలు క్యూలో ఉంటే... ఇప్పుడు మరొక క్రేజీ మూవీ కూడా వచ్చి చేరింది.
ముందుగా ఈ సంక్రాంతి రేసులో అందరికంటే ముందే జనవరి 8న రాబోతోంది మహాకాళి (Mahakali). పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ వర్మ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో ఈ డివోషనల్ యాక్షన్ సబ్జెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి. ఎలాంటి వివాదాలకి పోకుండా తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లలో పండగ వాతావరణం తీసుకురావడం ఆయన ప్రత్యేకత.
ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ జనవరి 12 విడుదల (January 12 Vidudala) తో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే జనవరి 12న సాయిదుర్గా తేజ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG: Sambarala Yeti Gattu )కూడా రిలీజ్ కానుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సాయిదుర్గా తేజ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలవబోతోందట.
ఇక జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కాకా (kaka) సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మెగాస్టార్ వచ్చిన మరుసటి రోజే, యంగ్ హీరో శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్' థియేటర్లలోకి రానుంది. ఈ కాంబో అందించే వినోదం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంతటితో ఈ లిస్ట్ ముగిసిందనుకుంటే పొరపాటే. గతేడాది 'సామజవరగమన'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజుల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ప్యాక్ (family pack) కూడా ఈ సంక్రాంతి రేసులోకి దూకింది. పండగ పూట పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా, ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న మెగాస్టార్ 'విశ్వంభర', డిసెంబర్‌లో రావలసిన ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలు కూడా వచ్చే సంక్రాంతికే బరిలోకి దిగుతాయనే ప్రచారం గట్టిగా సాగుతోంది. చూస్తుంటే ఈసారి సంక్రాంతి పండక్కి చాలా పెద్ద లిస్టే రెడీ అవుతోంది. కానీ చివరికి వచ్చేసరికి ఇందులో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ రేసులో నిలబడతాయో, ఏ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందో వేచి చూడాలి.