Sharwa: అదే కోవలో 'నారీ నారీ నడుమ మురారి' ట్రైలర్...
ABN , Publish Date - Jan 11 , 2026 | 06:59 PM
ఈ యేడాది సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాలన్నీ ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేశాయి. తాజాగా విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' ట్రైలర్ చూస్తే అదే అర్థమౌతోంది.
ఈ యేడాది సంక్రాంతి బరిలో దిగుతున్న అన్ని చిత్రాలు ఎంటర్ టైన్ మెంట్ ను అందించే విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మొదటగా వచ్చిన ప్రభాస్ మూవీలోనూ కామెడీకి చోటుంది. చాలా యేళ్ళ తర్వాత ప్రభాస్ తో దర్శకుడు మారుతి కామెడీ చేయించాడు. ఇక చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) మూవీలోనూ వినోదానికి పెద్ద పీట వేశారు. మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఫైట్స్ కూడా ఇందులో లేకపోలేదు. 13వ తేదీ వస్తున్న రవితేజ (Ravi Teja) 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahaasayulaku Wignpthi) సినిమా ట్రైలర్ లోనూ ఎంటర్ టైన్ మెంట్ కే అగ్రతాంబూలం ఇచ్చారు.
తాజాగా విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' (Nari Nari Naduma Murari) ట్రైలర్ కూడా అదే కోవకు చెందింది. ఈ రెండు సినిమాల ట్రైలర్ లోనూ కమెడియన్ సత్య డామినేషన్ కనిపిస్తోంది. అలానే రెండు సినిమాల్లోనూ ఇద్దరేసి హీరోయిన్లు ఉండటం మరో కామన్ థింగ్. ఇక పెళ్ళికి ఎదిగిన కొడుకు ఉన్న తండ్రి కూడా మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్ళి చేసుకోవడం, పిల్లలను కనాలనుకోవడం వంటి కాన్సెప్ట్ తో ఇటీవల కొన్ని సినిమాలు వచ్చాయి. తాజా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలోనూ ఆ పాయింట్ కు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో శర్వా (Sharwa) తండ్రిగా నరేశ్ నటించాడు. ఆ మధ్య వచ్చిన 'ఈషా' మూవీలో ప్రధాన పాత్ర పోషించిన సిరి హన్మంతు ఇందులో నరేశ్ భార్యగా నటించింది. డిసెంబర్ లో వచ్చిన 'అఖండ'లో యాక్షన్ హీరోయిన్ గా కనిపించిన సంయుక్త (Samyuktha) 'నారీ నారీ నడుమ మురారి'లో లవ్లీ మెచ్యూర్డ్ ఉమెన్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇక క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇన్నోసెంట్ గర్ల్ గా సాక్షి వైద్య (Sakshi Vaidya) సైతం ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్ర పోషించబోతున్నాడు. కానీ ఆ పాత్రను మాత్రం ఈ ట్రైలర్ లో రివీల్ చేయలేదు. దీని తర్వాత వచ్చే 'అనగనగా ఒక రాజు' సైతం వినోదాల విందునే వడ్డించబోతోందన్నది ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. మొత్తం మీద ఈ యేడాది సంక్రాంతి సినిమాలు ఆడియెన్స్ కు మృష్టాన్న భోజనాన్ని అందించబోతున్నాయి.