Samyuktha: 'ది బ్లాక్ గోల్డ్' షూటింగ్ పూర్తి!
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:34 PM
సంయుక్త నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'ది బ్లాక్ గోల్డ్' షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాను యోగేశ్ కె.ఎం.సి. తెరకెక్కిస్తున్నాడు.
వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త (Samyuktha)ప్రస్తుతం 'ది బ్లాక్ గోల్డ్' (The Black Gold) అనే హీరోయిన్ సెంట్రిక్ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చేస్తోంది. ఈ హై వోల్టేజ్ మూవీకి యోగేశ్ కె.ఎం.సి. దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మాగంటి పిక్చర్స్ సహకారంతో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని గౌరవించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు మేకర్స్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండస్ట్రియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా నిలబడి, చేతిలో గన్‌ను పట్టుకుని కనిపించడం ద్వారా ఆమె పాత్రలోని అగ్రెషన్‌ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు. 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఐదు పవర్‌ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగింది. తాజాగా మేకింగ్ వీడియోనూ విడుదల చేశారు. మేకర్స్ పడిన కష్టం అందులో కనిపిస్తోంది. ఈ సినిమా గురించి దర్శకుడు యోగేశ్ చెబుతూ, 'హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించామని, ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించామని, కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించామ'ని తెలిపారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న 'బ్లాక్ గోల్డ్' సినీ ప్రేమికులను, నేటి జన్ జీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. ఇందులో మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, BVS రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి.ఎస్. దీనికి సంగీతం అందిస్తున్నారు. 'ది బ్లాక్ గోల్డ్' తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాన్-ఇండియన్ విడుదల కానుంది.