సుప్రియకు సామ్ ప్రశంసలు.. లోగో వెనకున్న కథ ఇదే..
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:45 PM
నిర్మాత సుప్రియ యార్లగడ్డపై ప్రశంసల వర్షం కురిపించారు సమంత.
అడివి శేష్(Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ‘డెకాయిట్’ విజయం సాధించాలని సమంత (Samantha) అభిలషించారు. అలాగే నిర్మాత సుప్రియను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘డెకాయిట్’ 9Dacoit) సినిమా కోసం నువ్వు పడిన కష్టం, నీ పట్టుదల, సినిమాపై నీకున్న అంకితభావం నేను డైరెక్ట్‌గా చూశాను. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడానికి నీకంటే ఎవరూ అర్హులు కారు. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి’ అని సుప్రియ ను ఉద్దేశించి సమంత పోస్టులో పేర్కొన్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించనున్నారు.
శివ, గాయం వంటి చిత్రాలను నిర్మించిన ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్‌ను సుప్రియ రీ లాంచ్ చేశారు. దీనిపై తాజాగా సుప్రియ యార్లగడ్డ డెకాయిట్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంస్థ లోగోను రీ క్రియేట్ చేశారు. బ్యానర్ లోగోను డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని వెంకట్ ఆవిష్కరించారు. అయితే ఈ లోగో డిజైన్ వెనకున్న కారణాన్ని సుప్రియ చెప్పుకొచ్చారు. ‘ఎస్‌ఎస్ క్రియేషన్స్ లోగోలో నాకు ఇంపార్టెంట్ అయిన విషయాలున్నాయి. తాత గారి పంచె, అమ్మమ్మ కుంకుమ, పరిగెత్తే మా పాప, ముందు నడిపించే తాత.. గాయం సినిమా కోసం మా నాన్నగారు చేయించిన మ్యూజిక్.. ఇలా అన్ని కలిపి లోగో చేశాం. 15 సెకెన్లలో మా కథ ఎలా చెప్పుకోవాలో అనుకున్నా. డెకాయిట్ మొదలు పెట్టే ముందే ఇలా ఓ లోగో చేయించాలి అనుకున్నా. సినిమాకు రెండేళ్లు పట్టినట్టే లోగోకు సమయం పట్టింది’ అని అన్నారు.