Samantha: సమంతకు ఈ హిట్ ఎంతో అవసరం..
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:23 PM
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత (Samantha) ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేయగలదు.. సోలోగా నటించి సక్సెస్ అందుకోగల సత్తా ఆమెలో ఉంది
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత (Samantha) ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేయగలదు.. సోలోగా నటించి సక్సెస్ అందుకోగల సత్తా ఆమెలో ఉంది. అయితే వ్యక్తిగత సమస్యలు, మయోసైటీస్ వంటి అరుదైన వ్యాధితో కాస్త స్లో అయ్యారు సామ్. కొంతగ్యాప్ తర్వాత శాకుంతలం, యశోద చిత్రాలతో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. దాంతో మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని సొంతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థను ప్రారంభించి ‘శుభం’ (Subham)సినిమా చేసిన హిట్ కొట్టారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. నందిని రెడ్డి (nandini Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. సమంతకు నటిగా, నిర్మాతగా ఈ చిత్రం ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ ఆమెకు ఎంతో అవసరం. అలాగే దర్శకురాలు నందినీరెడ్డికి కూడా ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం. ఆమె గత చిత్రం కూడా సరైన విజయం అందుకోలేదు. అందుకే సమంత, నందినీ ఇందకూ హిట్ కోసం కుస్తీలు పడుతున్నారు.
అయితే ఇప్పుడు సమంతకు అంతా శుభశకునం లాగే కనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నారు. ఈ డేట్‌లో పోటీ కూడా ఏమీ లేదు. కథలో దమ్ముంటే విజయం పక్కా. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అయితే ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ట్రైలర్ ఆకట్టుకుని. పబ్లిసిటీ బాగా చేసుకుంటే సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. అయితే ఇప్పుడు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే పాత తరహా ప్రమోషన్ చేస్తే చాలదు. వైరల్ కంటెంట్ బయటకు వదలాలి, జనాల్ని థియేటర్ మెట్టు ఎక్కించే టెక్నిక్స్ వాడాలి. ఇవన్నీ లేకపోతే ప్రస్తుత కాలంలో సినిమాలు గట్టెక్కే ప్రసక్తే లేదు. కానీ సమంత హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తోంది కాబట్టి, పైగా సొంత నిర్మాణంలో కావడంతో తగిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తోనే సమంత కెరీర్ ఆధారపడి ఉంది.