రోషన్.. ప్రీతి ముకుందన్ జంటగా ‘ఏమో ఏమో ఇది’ షురూ 

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:20 PM

దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్ ను ఖరారు చేశారు

దర్శకుడు డా. శైలేష్ కొలను (Sailesh kolanu) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. రోషన్ మేకా (Roshan Meka), ప్రీతి ముకుందన్ (Preeti mukundan) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ (Emo Emo Idi) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను ఆవిష్కరించారు. తల్లి–కొడుకుల మధ్య సరదా సంభాషణతో   గ్లింప్స్ మొదలైంది.  నవతరం ప్రేమ బంధాలు, ఆధునిక వివాహాలు వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించారు. ‘హిట్’ యూనివర్స్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాతో  కొత్త జానర్‌లో అడుగుపెడుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న తొలి రొమాంటిక్ కామెడీ సినిమా ఇది.  ఇందులో అభయ్ పాత్రలో రోషన్ మేకా నటిస్తున్నారు. నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో రోషన్, అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు.  హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.  చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 2026 దసరా కానుకగా ఈ  సినిమా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. 

Updated Date - Feb 14 , 2026 | 12:39 PM