అందరూ మొదలెట్టేశారు.. సంబరాలు ఎప్పుడు స్టార్ట్ చేసేది తేజ్

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:25 PM

2027 సంక్రాంతి బరిలో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర సినిమాలు ప్రమోషన్లు ప్రారంభించినప్పటికీ ఈ చిత్రం నుంచి కొత్త కంటెంట్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

SYG

టాలీవుడ్ లో సంక్రాంతి అంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఇక పండగకి బరిలోకి దిగుతున్నామని కన్ఫర్మ్ అయితే ఆ సినిమాలు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. హైప్ తెచ్చుకోవడానికి మేకర్స్ ఏదో ఒక ప్రమోషన్ చేస్తూనే ఉంటారు. 2027 సంక్రాంతి పండుగ ఈసారి చాలా గట్టి పోటీనే తీసుకొస్తుంది. స్టార్ హీరోల సినిమాలు పండగ రోజున క్యూలు కట్టాయి. చిరంజీవి (Chiranjeevi) కాకా, శర్వానంద్ జార్జ్ క్రిష్, శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్, అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల,ప్రశాంత్ వర్మ మహాకాళి, సాయి దుర్గా తేజ సంబరాల ఏటిగట్టు సినిమాలు అధికారికంగా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.


మిగతా సినిమాలు అన్ని ప్రమోషన్స్ మొదలుపెట్టేశాయి. కానీ, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు మాత్రమే ఎలాంటి సంబరాలను ఇప్పటివరకు మొదలుపెట్టలేదు.రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా.. సంక్రాంతి బరిలోకి దిగుతుందా.. ఆగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాంటి అనుమానాలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు దాదాపు నలభై రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందన్న విషయం తెల్సిందే. కాకా, జార్జ్ క్రిష్, ఫ్యామిలీ ప్యాక్, జనవరి 12 విడుదల, మహాకాళి చిత్రాల నుంచి ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ రావడం.. హైప్ తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. కానీ, సంబరాల ఏటిగట్టు నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా రాలేదు.


మెగాస్టార్ చిరంజీవి సినిమా బరిలో ఉన్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పిన నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఎందుకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ చేయడం లేదని, మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి మూడు నెలలు ఉన్నప్పుడే కొంతమంది మేకర్స్.. హైప్ క్రియేట్ చేయడానికి, ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ కి నెల మాత్రమే ఉన్నా కూడా ఎందుకు ప్రమోషన్స్ వేగవంతం చేయడం లేదని అడుగుతున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొలిక్కి వచ్చాయని గతంలో ప్రకటించినప్పటికీ, కనీసం ఒక్క విజువల్ కంటెంట్ కూడా బయటకు రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.


సంబరాల ఏటిగట్టు తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగళ్ళ, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ వంటి ప్రముఖ నటులతో పాటు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇంత హైప్ ఉన్న సినిమాకి ప్రమోషన్స్ కూడా తోడు అయితే ఇక సినిమాకి తిరుగు ఉండదు. అన్ని తెలిసి కూడా మేకర్స్ ఇలా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందా.. లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 25 , 2026 | 07:27 PM