క్లయిమాక్స్ చిత్రీకరణలో 'సంబరాల యేటిగట్టు'!

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:58 AM

సాయిదుర్గాతేజ్ తాజా చిత్రం 'సంబరాల యేటి గట్టు' క్లయిమాక్స్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్ లో 18 యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించబోతున్నారు.

Sambarala Yeti Gattu Movie

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గాతేజ్ (Sai Durga Tej) తాజా చిత్రం 'సంబరాల యేటి గట్టు' (Sambarala Yeti Gattu) తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. రోహిత్ కె. పి. దర్శకత్వంలో ఈ సినిమాను 'హను-మాన్' (Hanu-Man) నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, ఆయన భార్య చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల సాయి దుర్గాతేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన 'అసుర ఆగమన' గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించడంతో మేకర్స్ ఉత్సాహంతో ఉన్నారు.


ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్న క్లయిమాక్స్ కోసం ఏకంగా ఇరవై కోట్ల రూపాయలను కేటాయించినట్టు నిర్మాతలు తెలిపారు. దాదాపు 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని, ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని చెబుతున్నారు. వీటిని ప్రముఖ స్టంట్ మాస్టర్ కెవిన్ నేతృత్వంలో తెరకెక్కించ బోతున్నారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌కు గురిచేస్తుందని అంటున్నారు. ఈ క్లయిమాక్స్‌ను మహాభారతంలోని కురుక్షేత్ర యుద్థం తీరున మహత్తరంగా, భావోద్వేగపూరితంగా తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తోంది. యుద్థరంగాన్ని తలపించే ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, సాయి దుర్గా తేజ్ ప్రమాదకరమైన యాక్షన్ ఎపిసోడ్ లో స్వయంగా రిస్క్ తీసుకుని నటిస్తున్నాడని మేకర్స్ తెలిపారు. ఈ భారీ యాక్షన్ మూవీకి బి. రజనీశ్‌ లోకనాథ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ 'సంబరాల యేటి గట్టు' సినిమా విడుదల కానుంది.

Updated Date - Feb 28 , 2026 | 11:58 AM