Sai Tej: తేజ కాకుమానుతో సాయి ధరమ్ తేజ్ సినిమా.. మళ్లీ మొదలైన చర్చ!

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:06 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనే చర్చ మొదలైంది

మెగా హీరో సాయిదుర్గ తేజ్ (Sai durga tej) తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని పూర్తి చేసుకుని, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎలాంటి కథతో ప్రేక్షకులను అలరించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్న ఓ యాక్షన్ డ్రామాకు సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ వార్త గతంలోనూ వైరల్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నటీనటులు, సాంకేతిక బృందం, కథాంశం వంటి వివరాలపై స్పష్టత రావాలంటే మేకర్స్ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

సాయి ధరమ్ తేజ్, అనిల్ సుంకర కాంబినేషన్‌లో కుదరడం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని రూపొందించాలని భావించారు. వీరు పొట్ల దర్శకత్వం వహించాల్సిన ఈ ప్రాజెక్టుపై అప్పట్లో ఆసక్తి నెలకొన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. దీంతో ఆ సినిమా కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది.  ఆ ప్రాజెక్టు ఆగిపోయినప్పటికీ, నిర్మాత అనిల్ సుంకరతో సాయి ధరమ్ తేజ్‌కు ఉన్న అనుబంధంతో గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆయనతో మరో సినిమా చేసేందుకు మెగా హీరో అంగీకరించినట్లు ఫిలిం నగర్ టాక్. ఈ క్రమంలోనే తేజ కాకుమాను దర్శకత్వంలో రూపొందనున్న కొత్త ప్రాజెక్టుకు సాయి ధరమ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - Oct 10 , 2026 | 12:57 PM