జానకమ్మ సంగీత దర్శకత్వం అందించిన ఏకైక సినిమా ఇదే..
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:07 PM
గాయనిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్. జానకి (S.Janaki) రెండు చిత్రాల్లో డబ్బింగ్, ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఉషాకిరణమూవీస్ వారి “చందమామరావే" (1987), "జడ్జిమెంట్" (1990) చిత్రాల్లో బేబి సుజితకు ఆమె డబ్బింగ్ చెప్పారు.
గాయనిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్. జానకి (S.Janaki) రెండు చిత్రాల్లో డబ్బింగ్, ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఉషాకిరణమూవీస్ వారి “చందమామరావే" (1987), "జడ్జిమెంట్" (1990) చిత్రాల్లో బేబి సుజితకు ఆమె డబ్బింగ్ చెప్పారు. అలానే ఉషాకిరణ్ మూవీస్ వారు గట్టిగా పట్టుపట్టడంతో “మౌనపోరాటం” (1989) చిత్రానికి సంగీత దర్శకత్వం చేశారు. ఆమె కంటే ముందు తెలుగులో పి. భానుమతి, పి. లీల, బి.వసంత సంగీత దర్శకత్వం చేశారు. తన సంగీత దర్శకత్వం గురించి జానకి చెబుతూ, 'సంగీత దర్శకత్వం అనేది కంప్లీట్ గా బ్రెయిన్ వర్క్. చాలా సమయం కేటాయి౦చి, ఓపికగా చేయాల్సిన పని. అది నాకు కుదరదు, ఎందుకంటే పాటలు పాడటానికే టైం చాలదు, ఇక మ్యూజిక్ కంపోజింగ్ కు సమయం కేటాయించడం ఎలా సాధ్యమౌతుంది? అందువల్ల ఆ తర్వాత ఆ ఆలోచన కూడా నేను రానివ్వలేదు. అయితే ఏవో కొన్ని ప్రైవేటు క్యాసెట్లకు సంగీతం సమకూర్చుకున్నాను.
భగవంతుడి దయవల్ల బాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా, ఆ లోటు కొంత తీర్చాడు దేవుడు. త్యాగరాజ కృతులు, మీరా భజన్స్ సొంత సంగీత దర్శకత్వంలో పాడాను. తిరువయ్యూరులో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా వరుసగా మూడేళ్ళు గాత్ర కచేరీ చేశాను. నాదస్వరంతో డోల్ కలిపి ఒక ప్రయోగం చేశాం ఒకసారి. అలా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇంకా మా సోదరి కుమారుడు జి. బాలకృష్ణప్రసాద్ (అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు) స్వరసారధ్యంలో ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలు పాడాను. నేను స్వయంగా సంగీతం చేసిన 'కృష్ణ రవళి' సంగీతా కంపెనీవాళ్ళు విడుదల చేశారు. 'నాదప్రవాహం' అని ఇంకో క్యాసెట్ కూడా చేశాం. ఇంకా పి.బి. శ్రీనివాస్ గారు తెలుగులో రచించిన 'భక్తిగీతాలు' అనే క్యాసెట్ కూ సంగీతమందించాను. ఇది కూడా సంగీతా వాళ్ళే రిలీజ్ చేశారు. ఇంకా అయ్యప్ప గీతాష్టకం, శ్రీ వెంకయార్య సుప్రభాతం, శ్రీ షిరిడీ సాయి గీతమాలిక వంటి చాలా క్యాసెట్లు పాడాను.
శాస్త్రీయం నేర్చుకున్నది ఒక సంవత్సరమే అయినా మా గురువు పైడి స్వామిగారి ఆశీస్సుల వల్లే అన్నీ నేను పాడగలుగుతున్నాననుకుంటాను. పాటలకు వరసలు కట్టడం, పాడడమే కాదు, కొన్ని పాటలు రాశాను కూడా. నేను ఎక్కువగా చదువుకోలేదు. ఆ మాట చెబితే, అబద్ధాలు చెబుతున్నావు అంటారు. బొమ్మలు కూడా వేస్తాను. ఎక్కువగా దైవభక్తి గీతాలే రాశాను. గతంలో ఓ తమిళ చిత్రానికి 'కన్నా నీ ఎంగే' అని ఓ పాట రాశాను. ఆ పాటను తెలుగులోకి అనువాదం చేసి 'కృష్ణా నువ్వెక్కడ' అంటూ 'ప్రియాపచ్చళ్లు' వాణిజ్య ప్రకటనలో పాటగా పాడాను' అని ఆమె తెలిపారు.