S Janaki: కళ్లకు కనిపించని కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు..

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:36 PM

తనపై వస్తున్నా ట్రోలింగ్ గురించి దివంగత గాయని జానకమ్మ మనవరాలు అప్సర స్పందించారు. నెటిజెన్ల కామెంట్స్ కు దీటుగా సమాధానమిచ్చారు  

దిగ్గజ గాయని, దక్షిణాది గాన కోకిల ఎస్‌.జానకి (S janaki) శనివారం కన్ను మూసిన సంగతి తెలిసిందే! ఆదివారం ఆమె అంత్యక్రియలు చిన్న మనవరాలు అప్సర నిర్వహించారు. అయితే అంత్యక్రియల సమయంలో అప్సర (Apsara vydyula) ఫొటోలు వైరల్‌ కాగా కొందరు ట్రోల్‌ చేశారు. ‘నాన్నమ్మ మరణిస్తే కనీసం బాధ లేదని’ ఆమెపై కామెంట్స్‌ చేశారు. దీనిపై బదులిస్తూ అప్సర సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

‘నాన్నమ్మకు ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి మా అక్క వర్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆమె అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికలు కూడా దగ్గర ఉంటాయి. మాట్లాడటం, ఆలోచించే తీరు అన్ని ఒకేలా ఉంటాయి. ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నాన్నమ్మ మరణం తర్వాత నేను చేసిన కార్యక్రమాలన్నీ మా అక్కే చేయాలి. ఆ స్థానం తనదే. కానీ దురదృష్టవశాత్తు ఆమె 2023లో కన్నుమూసింది. ఆ బాధ నుంచి మేం ఇప్పటికీ బయటకు రాలేదు. ఇప్పుడు వర్ష చేయాల్సిన బాధ్యతలను నేను ఎంత బాధతో నిర్వహించానో నాకు, నా మనసుకి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు నాకు కాస్త ఓదార్పునిచ్చే విషయం ఏంటంటే.. అక్క, నాన్నమ్మ పైన కలిసి ఉంటారనే భావన నా బాధను కాస్త తగ్గించింది. ఒక మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కొన్ని రోజుల్లో మాయమయ్యేది కాదు. జీవితకాలం బాధ అది. గడిచిన రెండు మూడు రోజుల్లో నన్ను చాలామంది ట్రోల్‌ చేశారు. నానమ్మ పోతే కనీసం ఏడవలేదని నాపై కామెంట్స్‌ చేస్తున్నారు. నా కళ్లల్లో నీరు కనిపించకపోవచ్చు. హృదయంలో బాధ ఎంతగా ఉందో నాకు తెలుసు. దయచేసి కళ్లకు కనిపించని కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు. మరణాన్ని ఒక లోతైన ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవాలని నానమ్మ ఎప్పుడూ చెబుతుండేది. నా అనుభవాలు నన్ను ఎంతో బలంగా చేశాయి. అసలు ఎదుటి వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియని వారు.. ఇష్టం వచ్చినట్లు అభిప్రాయాలు చెప్పడం చూస్తుంటే బాధగా ఉంది. మా నానమ్మ చాలా మంచి వ్యక్తి. మా అక్క కూడా అంతే. వాళ్లిద్దరూ మమ్మల్ని వదిలి వెళ్లారన్నదాని కంటే.. వారు స్వర్గంలో కలిశారనేది నాకు ఓదార్పునిస్తుంది’ అని అప్సర పేర్కొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 05:03 PM