దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. రేసులో వెనుకబడ్డ చరణ్?
ABN , Publish Date - Apr 26 , 2026 | 09:17 PM
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యుద్ధం కేవలం కలెక్షన్ల కోసమే కాదు, ఫర్‌ఫెక్షన్ కోసం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యుద్ధం కేవలం కలెక్షన్ల కోసమే కాదు, ఫర్‌ఫెక్షన్ కోసం కూడా జరుగుతోంది. ఒకప్పుడు ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) ముగ్గురూ ఒకే రేసులో ఉండేవారు. కానీ 'పుష్ప' సిరీస్ మేనియాతో అల్లు అర్జున్ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మారిపోయారు. ఆయన సినిమాల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఉండే బజ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మరియు నేషనల్ లెవల్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తుంటే.. బన్నీ తనకంటూ ఒక ప్రత్యేకమైన "మాస్ వేవ్"ను సృష్టించుకున్నారు. హిందీ బెల్ట్‌లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ ప్రస్తుతం మిగతా హీరోలకు గట్టి పోటీనిస్తోంది.
మరోవైపు ప్రభాస్ ప్రయాణం పూర్తిగా భిన్నమైన లీగ్‌లో సాగుతోంది. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే సంబంధం లేకుండా, ఆయన వెండితెరపై కనిపిస్తే అది ఒక "విజువల్ వండర్" అనే ముద్ర పడిపోయింది. ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు వేల కోట్ల ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. ఆయన ఎంచుకునే కథల స్కేల్ చూస్తుంటే, ఆయన ఇండియన్ సినిమాకు ఒక "గ్లోబల్ ఫేస్"గా మారిపోయారనిపిస్తుంది. కంటెంట్‌లో లోపాలున్నా ఓపెనింగ్స్ రాబట్టడంలో ప్రభాస్ దిట్ట. ఈ భారీ స్థాయి ఆయనను ఒక అన్‌రీచబుల్ పొజిషన్‌లో కూర్చోబెట్టింది.
అయితే సరిగ్గా ఇక్కడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో ఒక చిన్న ఆందోళన మొదలైంది. 'RRR' చిత్రంతో చరణ్‌కు ఆస్కార్ వేదిక వరకు గుర్తింపు దక్కింది, నటుడిగా ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమా తర్వాత రావాల్సిన వేగం ఎందుకో తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభాస్ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తుంటే, అల్లు అర్జున్ తన 'పుష్ప' బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ చరణ్ తన తదుపరి చిత్రాల విషయంలో తీసుకుంటున్న సమయం ఆయన విజిబిలిటీని కొంతవరకు తగ్గిస్తోంది.
నేటి ట్రెండ్‌లో నటన ఒక్కటే సరిపోదు, నిరంతరం వార్తల్లో ఉండటం మరియు ప్రేక్షకులను థ్రిల్ చేసే అప్‌డేట్స్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ, దాన్ని లోకల్ మార్కెట్‌లో నిలకడైన సక్సెస్‌గా మార్చడంలో జాప్యం జరుగుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం. అల్లు అర్జున్ మాస్ పల్స్ పట్టుకోగా, ప్రభాస్ భారీతనాన్ని పట్టుకున్నారు. మరి రామ్ చరణ్ మార్క్ ఏంటి? కేవలం 'మెగా పవర్‌స్టార్' అనే ట్యాగ్ సరిపోదు, 'RRR' తర్వాత ఆయన స్థాయిని నిలబెట్టే ఒక గ్లోబల్ హిట్ తక్షణ అవసరం.
అయితే రామ్ చరణ్ తన లైనప్‌లో ఉన్న దర్శకులతో సరైన మ్యాజిక్ చేయగలిగితే, మళ్ళీ ఈ సమీకరణాలు మారడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం చరణ్ నటించిన 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాలతో రామ్ చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో!.