ఎన్టీఆర్ తప్పు చేశాడు.. జాన్వీ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:24 PM
సోషల్ మీడియాలో ఈమధ్య ఏఐ (AI) సాంకేతికతతో రూపొందించే డీప్ ఫేక్ వీడియోలు, సెలబ్రిటీల గాసిప్స్ సర్వసాధారణంగా మారిపోయాయి. నెటిజన్లు కూడా వీటిని రెండ్రోజుల ముచ్చటగానే చూస్తారు.
సోషల్ మీడియాలో ఈమధ్య ఏఐ (AI) సాంకేతికతతో రూపొందించే డీప్ ఫేక్ వీడియోలు, సెలబ్రిటీల గాసిప్స్ సర్వసాధారణంగా మారిపోయాయి. నెటిజన్లు కూడా వీటిని రెండ్రోజుల ముచ్చటగానే చూస్తారు. ఇంకో కొత్త వీడియో రాగానే పాతదాన్ని మర్చిపోతుంటారు. జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో విషయంలోనూ అందరూ అలాగే అనుకున్నారు. దేవర చిత్రంలోని చుట్టమల్లె సాంగ్ ను ఏఐ ద్వారా అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అసలు నిజానికి చాలామందికి ఆ వీడియో ఒకటి ఉందనే విషయమే తెలియదు. కానీ, ఎప్పుడైతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేశారో, ఆ క్షణం నుంచి ఆ వార్త దావానలంలా వ్యాపించింది. అలాంటి నీచులమను అస్సలు వదిలిపెట్టను అని ఆయన వార్నింగ్ ఇవ్వడంతో మరింత వివాదంగా మారింది.
తెలియని వారు కూడా అసలు ఆ వీడియోలో ఏముందో అని గూగుల్, సోషల్ మీడియాలో సెర్చ్ చేసి మరీ వెతకడం ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్వీట్ తర్వాత ఇతర సినీ ప్రముఖులు కూడా వరుసగా పోస్టులు పెట్టడంతో, ఈ వివాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్లింది. లీగల్ కాన్సిక్వెన్సెస్ పక్కన పెడితే, ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ రచ్చ వల్ల చివరికి బాధితురాలైన జాన్వీ కపూర్‌కే ఎక్కువ ట్రోలింగ్ ఎదురైంది. సాంకేతికత పేరుతో వికృతానందం పొందే వికృత మనస్తత్వాల కంటే, ఈ అంశానికి అనవసరమైన పబ్లిసిటీ రావడం ఆమెకు మరింత శాపంగా మారింది.
ఈ సున్నితమైన అంశంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ తో పాటు ఇతర సెలబ్రిటీలు చేసిన పనిని ఆర్జీవీ బహిరంగంగానే తప్పుబట్టారు. 'అభ్యంతరకరమైన లింక్స్ లేదా కంటెంట్ గురించి కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలు బహిరంగంగా ట్వీట్లు చేయడం వల్ల, ఆ చెత్త కంటెంట్‌కు ఫ్రీగా పబ్లిసిటీ దక్కుతుంది. ఆ వీడియోలను దాచిపెట్టాల్సింది పోయి, మీరే ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేశారు'అని ఆర్జీవీ ఎద్దేవా చేశాడు.
ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో మైక్ పట్టుకుని అరవడం కంటే, చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ వీడియో తయారు చేసిన క్రిమినల్స్‌ను పట్టుకోవడంపై దృష్టి పెట్టాలని ఆర్జీవీ సూచించాడు. బాధితురాలికి సానుభూతి తెలపడం మంచిదే అయినా, ఆమె ఇమేజ్‌ను మరింత పణంగా పెట్టేలా పోస్టులు చేయడం కూడా ఒక రకంగా తప్పేనని వర్మ తేల్చిచెప్పాడు. దీంతో ఈ డీప్ ఫేక్ వివాదంలో ఎన్టీఆర్ స్టాండ్ కరెక్టా లేక ఆర్జీవీ లాజిక్ కరెక్టా అనే దానిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయి విపరీతంగా చర్చించుకుంటోంది. వర్మ చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు. ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వలనే ఆ వీడియో ఇంకా ట్రోల్ అయ్యిందని నెటిజన్స్ కూడా చెప్పుకొస్తున్నారు.