రేవంత్ రెడ్డి: గద్దర్‌ ఒక చైతన్యం.. ఒక స్ఫూర్తి

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:08 AM

'గద్దర్‌ ఒక చైతన్యం.. ప్రజా యుద్ధనౌక. గద్దర్‌ అనే  పేరు  లక్షల మందిని ప్రభావితం చేసింది. ఆయన గళం గురుంచి తెలియని వారు  ఉండరు. ఎన్నో ఉద్యమాలకు ఆయన ఊపిరి పోశారు.

'గద్దర్‌ ఒక చైతన్యం.. ప్రజా యుద్ధనౌక.. గద్దర్‌ అనే  పేరు  లక్షల మందిని ప్రభావితం చేసింది. ఆయన గళం గురుంచి తెలియని వారు ఉండరు. ఎన్నో ఉద్యమాలకు ఆయన ఊపిరి పోశారు. పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉంది' అని తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుక రెండో ఎడిషన్‌ ఉగాది సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

Kamal.jpg

రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 'తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యగా భావించింది. హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ హబ్‌, బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొ సినిమా హబ్‌కు కేరాఫ్‌. హైదరాబాద్‌కు చార్‌మినార్‌లోని చార్‌ మినార్స్‌లాగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ నలుగురు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఒకప్పుడు సినీ రంగంలో ఏ సమస్య వచ్చినా ముందుండే దాసరి నారాయణ రావు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రామోజీ రావు ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను సినీ పరిశ్రమ అభివృద్థికి కృషి చేశారు. ప్రభాకర్‌రెడ్డిగారు సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి ఆదుకున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మా  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ తమ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్‌ వచ్చినట్టే. సినిమా అనేది మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వెపన్‌. సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమాను సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తించి గద్దర్‌ స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరానికి సినిమా ద్వారా సందేశం అందించాలి’ అని అన్నారు.


Kamal.jpg

పైడి జయరాజ్‌ పురస్కారాన్ని అందుకున్న విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ మాట్లాడుతూ 'సినిమాను టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అని విడదీయలేం. మనది ఇండియన్‌ సినిమా. ‘సింగీతం పురస్కారం తీసుకుంటున్నప్పుడు నాకు ఆయన తీసిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమా గుర్తుకొచ్చింది. నేను 16 ఏళ్ల వయస్సులో హైదరాబాదుకు వచ్చాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అక్కినేని నాగేశ్వరరావుగారి 'శ్రీమంతుడు’ సినిమాకు పని చేశాను. సింగీతం గారితో 50 ఏళ్లుగా వర్క్‌ చేస్తూ వస్తున్నాను. చిరంజీవి పాలిటిక్స్‌లో నాకు సీనియర్‌. సినిమాల్లో జూనియర్‌. రేవంత్‌ గారు గద్దర్‌ గారి పేరిట అవార్డులు ఇవ్వటం గొప్ప విషయం. నేను గద్దర్‌ అభిమానిని. ఈ అవార్డుల ఇస్తున్న రేవంత్‌రెడ్డి హీరో’ అని అన్నారు.

R-narayana-murthy.jpg

నా జన్మ ధన్యం: ఆర్ నారాయణ మూర్తి 

కాంతారావు పురస్కారాన్ని అందుకున్న  ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తర్వాత అంతటి హీరో కాంతారావు. తెలంగాణ బిడ్డ అయిన ఆయన పేరుపై పురస్కారాన్ని నాకు ఇచ్చి జన్మ ధన్యం. పదమూడేళ్లపాటు సినీ పరిశ్రమ ఈ పురస్కారాల కోసం ఎదురు చూసింది.  తెలుగు సినిమా ఉనికిని, కళాకారుల్ని గుర్తించి  రేవంత్‌రెడ్డి గతేడాది పురస్కారాల్ని పునః ప్రారంభించారు. గద్దర్‌ ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పేరుపై ఈ పురస్కారాల్ని అందించినందుకు, కళాకారులను  గౌరవించినందుకు ఆయనకు నా అభినందనలు' అన్నారు. 

Updated Date - Mar 20 , 2026 | 10:31 AM