Chiranjeevi: దావోస్ సదస్సులో.. సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:18 PM
World Economic Forum 2026లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందంతో మెగాస్టార్ చిరంజీవి.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ (Telangana Rising) బృందం చురుకుగా పాల్గొంటోంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో బుధవారం ఓ ఆశ్చర్య కర సంఘటన చోటు చేసుకుంది.
ఈ WEF సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దావోస్‌కు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవించిన చిరంజీవి, సదస్సుకు హాజరై అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.

ప్రపంచ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి దిశను ప్రతిబింబించిన ఈ కార్యక్రమం చిరంజీవిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో కలిసి చిరంజీవి పలువురు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార నేతలతో ముచ్చటించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ, ఇటీవల తన కుటుంబ సభ్యులు, మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రాన్ని చూశామని, సినిమాను ఎంతో ఆస్వాదించామని చిరంజీవికి వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేశారు.
అయితే.. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా చోటు చేసుకున్న ఈ కలయిక ఇటు రెండు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను సంబ్రమాశ్చర్యాలకు గురిచేయగా వారి మధ్య ఉన్న బాండింగ్ మరోమారు బాహ్య ప్రపంచానికి తెలియజేసినట్లైంది.