Renu Desai: కుక్కని కాపాడిన తిడుతున్నారు.. ఎన్నాళ్లు నాకీ వనవాసం
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:49 PM
నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రేణు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా అందులో ఏదో ఒక విషయమై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఏ వేదికపై మాట్లాడినా ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన రావడం, దానిపై రకరకాల విమర్శలు, ప్రశంసలు ఎదురవ్వడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా తనపై అనునిత్యం విరుచుకుపడే పవన్ అభిమానుల వైఖరిపై ఆమె పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ తో విడిపోవడం తనకు వనవాసంతో సమానమని రేణు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ నుంచి తాను విడిపోయి దాదాపు 14 సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వకుండా కేవలం పవన్ మాజీ భార్య అనే ముద్రకే పరిమితం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. 'తెలుగు ప్రజలందరికీ నేను ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నా జీవితం బద్రి చిత్రంతోనే ప్రారంభమైందని అంతా భావిస్తుంటారు. అంతకుముందు నాకంటూ ఒక జీవితం లేదా? మా విడాకులు జరిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీరాముడి వనవాసం కూడా 14 ఏళ్లతో ముగిసింది.. కానీ నా ఈ మానసిక వనవాసం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావడం లేదు' అంటూ ఆమె ఆవేదన నిండిన కళ్లతో ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
'నేను ఒక నటిని.. 2012లో విడాకుల అనంతరం నేను మరాఠీ చిత్రం నిర్మించాను. అది బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. మరో చిత్రానికి కథ అందించి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించాను. వీటితో పాటు పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, కవితలు రాయడం, ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుండటం లాంటివి చేస్తున్నాను. ఇవన్నీ నా సొంత ప్రతిభతో వచ్చినవి. నా సొంత గుర్తింపు. స్వయంకృషితో ఎదిగిన తనకు ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయని' ఆమె నిలదీసింది.
అంతేకాకుండా తాను మూగజీవాలను, కుక్కలను కాపాడే ప్రయత్నం చేసినా కొందరు కావాలని నిందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ తోడు లేకపోతే అసలు సమాజంలో బతికే అర్హతే లేదన్నట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత నిర్ణయాలను బేస్ చేసుకుని ఒక మహిళను నిరంతరం వేధించడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించింది. రేణూ దేశాయ్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.