Venkatesh: ఆ సినిమా మీద ఆశలు వదులుకో వెంకీ.. కష్టం

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:04 PM

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు.

Venkatesh

Venkatesh: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు మన టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్ రావడానికి అసలైన పునాది వేసింది మాత్రం దృశ్యం (Drishyam) సినిమానే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇండియన్ సినిమా దగ్గర ఒక సంచలనం. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యి భారీ వసూళ్లను సాధించింది.

విక్టరీ వెంకటేష్ కెరీర్ కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో దృశ్యం ఆయనకు కొత్త ఊపిరి పోసింది. రాంబాబు పాత్రలో వెంకీ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రికార్డు స్థాయి వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు అసలు చిక్కు దృశ్యం 3 తో మొదలైంది. ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 3 పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదే ఇప్పుడు మన వెంకీ మామకు, తెలుగు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఏ సినిమా అయినా నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. మలయాళ వెర్షన్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఆ కథ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది.

పోనీ తెలుగులో వెంటనే రీమేక్ చేద్దామా అంటే.. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యే వరకు వెంకీ మరో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ కూడా దృశ్యం 3 కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ వారు మలయాళ కథతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్‌తో వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఏప్రిల్‌లో మలయాళ వెర్షన్ వచ్చేస్తే.. ఆ కోర్ పాయింట్ లీక్ అయిపోతుంది. సోషల్ మీడియా ట్రెండ్‌ నడుస్తున్న ఈ రోజుల్లో సీక్రెట్‌ను దాచడం అసాధ్యం. ఆ సస్పెన్స్ రివీల్ అయ్యాక, మళ్ళీ అదే కథతో తెలుగులో రీమేక్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనివల్ల తెలుగులో దృశ్యం 3 రీమేక్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. మలయాళ వెర్షన్‌ను తెలుగులోకి నేరుగా డబ్ చేసి రిలీజ్ చేయడం. రెండు.. కథలో భారీ మార్పులు చేసి వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మలచడం. ఏది ఏమైనా, రాంబాబు తెలివితేటలు ఈసారి తెలుగులో ప్రేక్షకులను మెప్పిస్తాయా.. లేదా వెంకీ మామ ఈ సీక్వెల్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Updated Date - Jan 07 , 2026 | 10:04 PM